Slbc Accident : ఎస్ ఎల్ బీసీ టన్నెల్ (Tunnel) ఘటనపై తీవ్ర ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. ఘటన జరిగి ఐదు రోజులు గడిచిపోతున్నా లోపల చిక్కుకున్న ఎనిమిది కార్మికుల జాడే లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నా సరే.. ఇంకా వారిని వెలికితీయలేదు. ఈ ప్రమాదం జరిగిన చోటుకు 50 మీటర్ల దాకా వెళ్లినట్టు ర్యాట్ హోల్ మైనర్స్ చెబుతున్నారు. ప్రమాదం జరిగిన చోట అంతా బురదనే ఉందని, ఆక్సిజన్ లెవల్స్ చాలా తక్కువగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
తమ వెంట ఎన్డీఆర్ ఎఫ్ (Ndrf) బృందాలు కూడా వచ్చాయని.. అంతకంటే ముందుకు వెళ్లొద్దని సూచించడంతో వెనక్కు వచ్చేసినట్టు వివరించారు. ప్రమాదం జరిగిన చోట బురద నీరు ఉబికి వస్తోందని.. అదే చాలా సమస్యగా మారినట్టు చెప్పుకొస్తున్నారు. ప్రమాదం జరిగిన దగ్గర్లో అసలు వెలుతురే లేదని.. అక్కడకు వెళ్లడం చాలా కష్టంగా ఉందని వివరించారు. కలెక్టర్ తో మాట్లాడి మరోసారి వెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. దీంతో టన్నెల్ వద్ద తీవ్ర భావోద్వేగ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కార్మికుల జాడ తెలియకపోవడంతో వారు బ్రతికే అవకాశాలు ఉన్నాయా లేవా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. మరో వైపు వారు క్షేమంగా బయటకు రావాలని దేశ వ్యాప్తంగా అందరూ కోరుకుంటున్నారు.