KTR on Kavitha’s Letter: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె.. లేఖపై స్పందించారు. తన తండ్రి చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు మరింత రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కవితకు పరోక్షంగా చురకలు అంటించారు.
కేటీఆర్ ఏమన్నారంటే!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ లో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందని కేటీఆర్ అన్నారు. ఎవరైనా సూచనలు చేయవచ్చని.. లేఖలు రాయవచ్చని చెప్పారు. అయితే పార్టీ అంతర్గత విషయాలను బయటకు మాట్లాడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫోరంస్, ఆఫీస్ బేరర్స్ ఉన్నాయని చెప్పారు. అధ్యక్షుల వారిని కలిసి చెప్పుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. ఇది అందరికీ వర్తిస్తుందని వీరికి.. వారికి అన్న తేడా లేదని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరం పార్టీలో కార్యకర్తలమేనని పరోక్షంగా కవితకు సూచించారు.
రేవంత్ రెడ్డే ఒక దెయ్యం!
కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో కవిత అన్న దెయ్యం అంశాన్ని రిపోర్టర్లు ప్రశ్నించారు. దీంతో కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే దెయ్యం, దేవుడు గురించి ఎందుకు? అని ప్రశ్నించారు. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. తమ పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పట్టిన శని రేవంత్ అని.. దానిని వదిలించడమే తమ పని అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణకు అవమానకరం
యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన చార్జీ షీట్ లో రేవంత్ రెడ్డి పేరును ఈడీ చేర్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఇది తెలంగాణకు అవమానకరమని చెప్పారు. రేవంత్ రెడ్డి బుద్ధి, వైఖరి మారలేదని అర్థమైందని అన్నారు. ఓటుకు నోటుకు కేసు నుంచి రేవంత్ రెడ్డికి బ్యాక్ మ్యాన్ అని పేరుందని.. ఇప్పుడు సీటుకు నోటు కుంభకోణంలో ఇరుక్కున్నారని చెప్పారు. ఏఐసీసీకి తెలంగాణ ఏటిఎంలా మారిందని కేటీఆర్ అన్నారు.
సీఎం రాజీనామాకు డిమాండ్
నైతికత ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చీకట్లో బీజేపి పెద్దల కాళ్ళు పట్టుకోవటానికి డిల్లీ వెళ్ళారని ఆరోపించారు. రాహుల్ గాంధీ, మోదీ, అమిత్ షాను ప్రసన్నం చేసుకోవటానికే రేవంత్ 42 సార్లు ఢిల్లీ వెళ్ళారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నైతికత ఉంటే రేవంత్ రెడ్డిని తొలగించాలని చెప్పారు. కాంగ్రెస్ డీన్ఏ లోనే కరప్షన్ ఉందన్న కేటీఆర్.. అతడి విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు.
Also Read: Vallabhaneni Vamsi Health: వంశీకి మళ్లీ సీరియస్.. పోలీస్ స్టేషన్‌లో వాంతులు.. ఆందోళనలో ఫ్యామిలీ!
బీజేపీ స్పందిస్తుందా?
తెలంగాణలో ఎన్ని స్కాంలు జరుగుతున్నా.. కేంద్రం ఎందుకు స్పందించటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలు గమనించాలని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న స్కాములపై నెల రోజుల్లో కేంద్రం స్పందిస్తుందా? లేదా? అని చూస్తామన్నారు. స్పందించకపోతే మా పార్టీలో చర్చించి కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు.