KTR On SIT Notices: తెలంగాణ రాజకీయాల్లో రచ్చ లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సిట్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి, మాజీ మంత్రి కేటీఆర్ (KTR On SIT Notices) స్పందించారు. ‘‘సిట్ అంటే కార్తీకదీపం సీరియల్ లాంటిది’’ అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అంటూ ఆరోపణలు గుప్పించారు. రెండేళ్లు డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు తప్ప సాధించింది ఏమైనా ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
సిట్ కాదు, బిట్ కాదు. తెలుగులో కార్తీక దీపం అని ఒక సీరియల్ వస్తుంది. అది ఒడవది, తెగది. ఇది కూడా గంతే. రెండేళ్ల నుంచి పాపం రేవంత్ రెడ్డికి పరిపాలన రాదు. చేతకాదు. అసమర్థుడు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివిలేదు. 420 హామీలు ఇచ్చి, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలంటే ఏం చేయాలి.. ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్స్ ఆడాలి. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని మరికొన్ని రోజులు డ్రామా. అలాగే, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా. కొన్ని రోజులు ఫార్ములా ఈ-రేస్ అని డ్రామా. ఈ రెండేళ్లు డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు తప్ప, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
Read Also- Belt Shops Controversy: బెల్టుషాపును అడ్డుకుంటే ఊరుకోం.. మహిళలపై మందుబాబుల గుర్రు!
పోలీస్ స్టేషన్‌కు రండి.. కేటీఆర్‌కు నోటీసులు
తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావాలని (Notice to KTR) కోరారు. 160 సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు జారీ చేశారు. కాగా, ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావుని మంగళవారమే సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొడుకుగా ఉన్న కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రతి విషయం తెలుసునంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నోటీసులు వెలువడడం ఉత్కంఠగా మారింది. కొత్త విషయాలపై ప్రశ్నించేందుకే కేటీఆర్‌ను పిలిచిందా?, ఏయే అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించనున్నారనేది ఉత్కంఠగా మారింది. ఒక లిస్ట్ ముందుపెట్టి సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు నిర్ఘాంతపోయారంటూ ఊహాగానాలు నడుస్తున్నాయి. ‘‘మీపై నిఘా పెట్టి, మీ ప్రతి కదలికను ప్రభుత్వం గమనించింది తెలుసా?’’ అని సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు హరీష్ రావు కొన్ని సెకన్లపాటు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారంటూ ప్రచారం జరుగుతోంది.
Read Also- Belt Shops Controversy: బెల్టుషాపును అడ్డుకుంటే ఊరుకోం.. మహిళలపై మందుబాబుల గుర్రు!
నెక్స్ట్ ఎవరు?
ఈ కేసులో ఇప్పటికే ప్రశ్నించిన సాక్షులు ఇచ్చిన చాలా సమాధానాలను సమగ్రంగా విన్న తర్వాత అధికారులు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. కేటీఆర్‌ను ఏయే ప్రశ్నలు అడగనున్నారు?, ఏమైనా కొత్త విషయాలు బయటపడతాయా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఈ కేసులో బీఆర్ఎస్‌కు చెందిన మరికొందరు నేతలను కూడా ప్రశ్నించవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. నాటి ప్రభుత్వ పెద్దగా ఉన్న కేసీఆర్‌ను ప్రశ్నిస్తారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. సంతోష్‌ని కూడా ప్రశ్నించే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే, కవితను కూడా సాక్షిగా పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, తన భర్త ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారంటూ గతంలో ఆమె ఆరోపించారు.

