KTR: జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మంత్రులంతా టూరిస్టులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఎన్నికలు అయిపోగానే వాళ్లంతా గాయబ్ అవుతారన్నారన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేది బీఆర్ఎస్ నేతలే అని స్పష్టం చేశారు. ఆదివారం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట, సమత కాలనీలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ మైనారిటీ నేతలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ‘కాంగ్రెస్ బకాయి కార్డు’లను ప్రజలకు అందజేశారు. కాంగ్రెస్ హామీలతో మోసం చేస్తుందని వివరించారు.
Also Read- Tollywood: టాలీవుడ్ పెద్దరికం.. బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారా?
‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమం
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హామీలు, గ్యారెంటీలతో దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చెంప పెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామన్నారు. అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులైనా ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, ఇప్పటికి ఒక్కో మహిళకు రూ.55,000 బాకీ పడ్డారని చెప్పారు. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇవ్వకుండా ఒక్కొక్కరికి రూ.44,000 బాకీ ఉన్నారని తెలిపారు. అలానే విద్యార్థులకు స్కూటీ ఇవ్వలేదు కానీ, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మోసాలన్నింటినీ గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు.
ఈ రెండు ఉదాహరణలు చాలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే అద్భుత అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిందన్నారు. ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే మరో మూడేళ్లపాటు వారి అరాచకాలకు అడ్డే ఉండదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కులమతాలకు అతీతంగా తెలంగాణలోని సబ్బండ వర్ణాలు, కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్పారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అసలు అభివృద్ధే జరగడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి వ్యాసం రాస్తే, తన నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు వంద కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఏకంగా ప్రపంచ బ్యాంకుకే లేఖ రాశారన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలన్నారు. ‘ప్రజెంట్ సిటీ’ వరదలతో మునుగుతుంటే, దోమలతో జనం ఇబ్బందులు పడుతుంటే, ‘ఫ్యూచర్ సిటీ’ కడతానని సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవిష్యత్ తరాలే ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్న మెట్రోను రద్దుచేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి కొత్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు