KTR: గ్రూప్-1 అవకతవకలపై జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందినగర్ లో గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఆకాంక్షల మేరకు తిరిగి పరీక్ష నిర్వహించాలన్నారు. టీఎస్పీఎస్సీ అవినీతి, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణపై జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. సిట్టింగ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి (లేదా రిటైర్డ్ జడ్జి) ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలన్నారు. ఈ వ్యవహారంలో అన్యాయం చేసిన బ్రోకర్లు, దోషులు బయటకు రావాలన్నారు. ఎవరు ఉద్యోగాలు అమ్ముకున్నారో, ఎక్కడ తప్పులు జరిగాయో స్పష్టతకు రప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని అన్నారు.
Also Read: Bellamkonda Sai Srinivas: వారి వల్లే సినిమాకు అలా జరిగింది.. అలా అనే సరికి బాధేస్తోంది
కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం
రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ అశోక్ నగర్ దాకా వచ్చి హామీ ఇచ్చారన్నారు. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని యువత భావించి, తమ కుటుంబాలతో పాటు ఇతరుల కుటుంబాలను కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయించారన్నారు. కానీ, వారి ఆశలను అడియాశలు చేస్తూ, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శతాబ్దంలోనే అతిపెద్ద మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్న పత్రం లీక్ అయిన వెంటనే, తప్పును సరిదిద్దడం కోసం పరీక్షను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
విద్యార్థులకు తీవ్ర అన్యాయం
కానీ ఈ ప్రభుత్వం 500 పోస్టులకు కేవలం 63 పోస్టులు మాత్రమే కలిపి, గ్రూప్-1 నోటిఫికేషన్ పేరిట అడ్డగోలుగా పరీక్షలు నిర్వహించి అవకతవకలకు పాల్పడిందన్నారు. జీవో నెంబర్ 29 ద్వారా ఈసీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. “కేవలం బేషజాల కోసం గలీజ్ రాజకీయం చేయకండి, ఈగోకు పోయి నిరుద్యోగులకు నష్టం చేయకండి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయండి. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ విద్యార్థులు వేసిన ఓట్ల వల్లేనని గుర్తించండి” అని సూచించారు. ప్రభుత్వం కేవలం రీవాల్యుయేషన్‌కు పోకుండా, గతంలో తప్పు చేసిన వారి చేతికే మళ్లీ సమస్యను అప్పజెప్పకుండా తిరిగి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో జరిగిన అవినీతి గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించాలన్నారు.
అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి
రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై అలుపెరగని పోరాటం చేసిన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ పోరాటంలో విద్యార్థులపై ప్రభుత్వం అణచివేతకు పాల్పడిందని తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులపై పెట్టిన అన్ని అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 కేసులో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి గుణపాఠం అన్నారు. ఇన్ని రోజులపాటు గ్రూప్ వన్ అభ్యర్థులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా వారిపై అణిచివేతకు పాల్పడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Apple iPhones: ఐఫోన్ 15,16 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 20,000 తగ్గింపు