Ktr : కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనను చేయాలని కేంద్రం భావిస్తే.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దంటూ ఆయన కోరారు. అలా చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే న్యాయం జరుగుతుందని.. దక్షిణాది రాష్ట్రాల ప్రభావం పార్లమెంట్ లో తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు. గతంలో దేశ అవసరాలకు అనుగుణంగా తీసుకొచ్చిన కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు బాగా అమలు చేశాయని.. కాబట్టి ఇప్పుడు జనాభాను చూసి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దంటూ కోరారు.
నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని కోరిన తమిళనాడు సీఎం స్టాలిన్ (stalin) వ్యాఖ్యలకు అనుగుణంగా కేటీఆర్ మాట్లాడారు. దేశ ఆర్థిక బలాన్ని పెంచడంలో దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాయని.. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పునర్విభజన ఉండాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడూ తెలంగాణ కోసం బడ్జెట్ లో పెద్దగా కేటాయించింది ఏమీ లేదని.. ఇప్పటికైనా తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.