Saraswati Pushkaralu: కాళేశ్వరం సరస్వతీ నదీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని మంత్రులు మంత్రి కొండా సురేఖ, శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సరస్వతీ పుష్కరాలపై మంగళవారం రివ్యూ మీటింగ్ హైదరాబాద్ సెక్రటేరియట్ లోని ఎండోమెంట్ మంత్రి కార్యాలయంలో నిర్వహించారు. ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈనెల 15నుంచి 26వరకు 12 రోజులపాటు పుష్కరాలు జరుగనున్నాయన్నారు.
ఉత్తరాన ప్రయాగ వద్ద, దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని తెలిపారు. ఈ త్రివేణి సంగమ స్నానానికి లక్షలాది భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారని తెలిపారు. సరస్వతీ నది పుష్కరాలు బృహస్పతి మిథున రాశి (మిథునరాశి)లోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారని, ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన పుష్కరాలు తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తరువాత వచ్చాయని అన్నారు.
2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతాయని, అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని ఆదేశించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ పుష్కరాలు విజయవంతం నిర్వహించేందుకు తమ ప్రభుత్వం చాలా క్రీయాశీలకంగా పని చేస్తుందన్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చలువ పందిళ్లు, టెంట్‌లు, శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఆర్టీసీ బస్సులను అవసరానికి అనుగుణంగా నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు రవాణా, శానిటరీ, భద్రతా, వైద్య సదుపాయాలు పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఆర్ అండ్ బీ ప్రిన్స్ పల్ సెక్రటరీ వికాస్ రాజ్, సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్, ఎండోమెంట్ కమిషనర్ వెంకటరావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర శాఖల ఉన్నతాధికారులు, ఆలయ ఈఓ మహేశ్, ఆలయ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు