Komatireddy Venkatreddy : సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి (rajalingamurthy)హత్య కేసులో ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ (medi gadda barrage) కుంగుబాటుపై గతంలో కేసీఆర్ పై రాజలింగమూర్తి కేసు వేశారు. ఆ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయన్ను అత్యంత దారుణంగా చంపడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజలింగమూర్తి కేసును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తన భర్త రాజలింగమూర్తిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చంపించాడని అతని భార్య ఆరోపిస్తోందని.. ఏదైనా ఉంటే న్యాయపరంగా పోరాడాలి తప్ప ఇలా చంపేస్తారా అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు.
డబ్బులు పోతే తెచ్చుకోవచ్చు గానీ… ప్రాణాలు పోతే ఎలా అని ఆవేదన తెలిపారు. రాజలింగమూర్తి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుంది. వారి అవినీతిపై ఎవరు ప్రశ్నించినా ఇలా చంపేస్తారా. కేసీఆర్ పై పోరాడుతున్న చక్రధర గౌడ్ కు రక్షణ కల్పిస్తాం. కేసీఆర్ నుంచి ఎవరికైనా ప్రాణహాని ఉంటే వారు మమ్మల్ని సంప్రదించాలి. రక్షణ కల్పిస్తాం’ అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక రాజలింగం కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కేసుపై ఆరా తీశారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఆయన కూడా దీనిపై మాట్లాడే అవకాశం ఉంది.