Dr Nandakumar Reddy: వైద్య విద్యకు మంచి భవిష్యత్తు ఉందని, ప్రపంచంలో మరణం లేనిది విద్యా, వైద్యం మాత్రమేనని కేఎన్ఆర్ యుహెచ్ఎస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా లక్ష్మక్కపల్లి ఆర్విఎం మెడికల్ కళాశాలలో చైర్మన్ డాక్టర్ యాకయ్య అధ్యక్షతన జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
గ్రామీణ పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా దృష్టి పెట్టాలని రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కటి సేవలందిస్తే సమాజంలో గౌరవం, గుర్తింపు దక్కుతుందన్నారు. ఆర్వీఎం ట్రస్టు ప్రజా వైద్యశాలగా గుర్తింపు తెచ్చుకుంటూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నట్లు ప్రశంసించారు. అయితే వైద్య విద్య గ్రాడ్యుయేషన్ తో ముగియదని స్పష్టం చేస్తూ నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పరిశోధన, ఉత్తమ పద్ధతి, పురోగతితో జ్ఞానం, నైపుణ్యత పెంచుకోవడానికి దోహదపడుతుందని అన్నారు.
Also read: Mahesh Kumar on KCR: కేసీఆర్.. దమ్ముందా? ఛాలెంజ్ అంటూ టీపీసీసీ చీఫ్ సవాల్!
నిరంతరం వినూత్న విధానాలు, వ్యూహాలను అన్వేషిస్తూ సవాళ్లను అధిగమించడంపై దృష్టి పెట్టాలని, తద్వారా చక్కటి ఫలితాన్ని సాధిస్తారని తెలిపారు. నిరంతర విద్యార్థిగా గ్రాడ్యుయేట్ వైద్యులు భావిస్తూ ఆరోగ్య నిపుణుల సలహాలు స్వీకరించాలని సూచించారు. సాంప్రదాయ పద్ధతులు, ఆధునిక అభ్యాసన విధానాలపై వైద్య విద్య ఆధారపడి ఉండగా, మెరికల్లాంటి శిక్షకులు, చక్కటి వసతులు, బోధన, నైపుణ్యత కలిగిన ఆర్వీఎం మెడికల్ కళాశాల అగ్రశ్రేణి వైద్యులుగా తీర్చిదిద్దుతున్న ఘనత దక్కించుకుంటున్నట్లు చెప్పారు.
కాగా వైద్య విద్యార్థులు సురక్షిత, నియంత్రిత వాతావరణంలో క్లినికల్ నైపుణ్యత సాధించాలని ఆకాంక్షించారు. వైద్య విద్య ప్రమాణాలు, బోధన పద్ధతులు, నిష్టాతులైన నిపుణులతో కూడిన మెడికల్ కళాశాలలు నెలకొన్న పోటీ తత్వంలో దూసుకెళ్తాయని, తల్లిదండ్రులు వాటిని గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. అయితే తమ పిల్లలు డాక్టర్లు కావాలో…? మంచి డాక్టర్లుగా గుర్తింపు పొందాలో…? తల్లిదండ్రులు ఎంచుకోవాలని కోరారు. సమాజ భవిష్యత్తును నిర్దేశిస్తున్న వైద్య విద్యతో ఆరోగ్యకర వాతావరణ నెలకొంటుందని వివరించారు.