మే నెలలో సాంప్రదాయ బద్ధంగా వికసించాల్సిన మే పుష్పం మూడో వారంలో వికసించింది. తన అందాలను విరజిమ్ముతూ అందర్ని ఆకట్టుకుంటుంది. ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలోని నేలార్ పేట వీధిలో నివాసం ఉంటున్న శుద్ధపల్లి సత్యనారాయణ-సత్యవతి దంపతుల గృహ ఆవరణలో మే పుష్పం వికసించి అందరిని ఆకట్టుకుంటుంది.
సత్యనారాయణ-సత్యవతి దంపతులు తమ ఇంటి ఆవరణలో రకరకాల పూల మొక్కలతో పాటు మే నెలలో పూసే మొక్కను సైతం నాటారు. వేసవి సమయంలో ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ వాటిని రక్షిస్తున్నారు. వారు చేసిన కష్టానికి ఫలితంగా మే పుష్పం వికసించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో జాగ్రత్తగా పరిరక్షిస్తూ పెంచి పోషించిన మే మొక్క దుంప జాతికి చెందినది కావడం గమనార్హం.
అయితే, ఈ మొక్క మే నెలలో మొదటి వారానికి మొగ్గ తొడిగి రెండు, మూడో వారంలో పుష్పంగా మారి తన అందాలను విరజిమ్ముతూ పది రోజులపాటు వికసిస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క రేఖ రాలిపోయి మొక్కగా మిగులుతుంది. అయితే, ఇలాంటి అరుదైన మే పుష్పాన్ని నేలార్ పేట వీధి ప్రజలందరూ చూసి సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.యువత తమ సెల్ ఫోన్ లో మే పుష్పాన్ని బంధించి గుర్తుగా పెట్టుకుంటున్నారు.