SLBC Tunnel Tragedy: ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నాగర్ కర్నూల్ లో జరిగిన ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఎక్స్’లో సంబంధింత వీడియోను షేర్ చేసిన ఆయన… ప్రాజెక్టు పనులు జరుగుతుండగా సొరంగం పెకప్పు కూలడం విషాదకరమన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల క్షేమం కోసం, వారి భద్రత కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యలలోభాగంగా భారత ప్రభుత్వం.. రాష్ట్ర అధికారులతో కలిసి పనిచేస్తూ, నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని సహాయాలను అందిస్తోందని పేర్కొన్నారు.
అందులో భాగంగానే రెస్క్యూ ఆపరేషన్ కోసంఎన్డీఆర్ ఎఫ్ బృందాలను, ఆర్మీని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంపిందని తెలిపారు. జరిగిన దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సైతం విచారణ వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ కు ఫోన్ చేసి మాట్లాడిన మోదీ… సహాయ చర్యల గురించి ఆరా చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్ బీసీ) టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మొత్తం 40 మంది ఉండగా 32 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగతా 8 మంది కోసం ఇంకా గాలిస్తున్నారు. వారిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు మిషన్ ఆపరేటర్లు, మరో నలుగురు ఝార్ఖండ్ కు చెందిన కూలీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, చిక్కుకుపోయిన ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అదనంగా కేంద్ర బలగాలు మూడు హెలికాప్టర్ లలో టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. మంత్రులు జూపల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి… బలగాలతో కలిసి సొరంగం లోపలికి బలగాలతో కలిసి వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. అనంతరం,ఇది మానవ తప్పిదం కాదని ప్రమాదవశాత్తు జరిగిందని జూపల్లి వ్యాఖ్యలు చేశారు. ఈ దుర్ఘటన జరగడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ మాత్రం లేదని విపక్షాలు అనవసరంగా బురద జల్లుతున్నాయని తెలిపారు.
అంతకుముందే, దుర్ఘటనపై స్పందించిన మరో కేంద్రమంత్రి బండి సంజయ్… ఎన్డీఆర్ ఎఫ్ అధికారులకు ఫోన్ చేసి త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు… విజయవాడ నుంచి రెండు, హైదరాబాద్ నుంచి ఒక బృందం రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఆ ఏనిమిది మంది బయటపడాలని యావత్ దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు.