ఖమ్మం, స్వేచ్ఛ: Khammam District: ఖమ్మం జిల్లాలో వేసిన యాసంగి పంట ఎక్కడా కూడా ఎండి పోకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం కలెక్టర్ యాసంగి పంటకు నీటినిర్వహణపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, నీటిపారుదల శాఖకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారితో సాగునీటి నిర్వహణ కమిటీ ఏర్పాటు చేశామని, వీరు పంట కోతలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా పంట నష్టం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో సాగునీటికి ఇబ్బంది లేదని రైతులు ఆందోళన చెందవద్దన్నారు.రైతులకు నీటి షెడ్యూల్ పై సమాచారం అందించాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా పంటలు ఎండి పోకుండా గ్రామస్థాయి కమిటీలు పని చేయాలని తెలిపారు. ప్రతి మండల తహసిల్దార్, మండల వ్యవసాయ అధికారి, పోలీస్ అధికారి, ఇరిగేషన్, విద్యుత్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని, వీరు కూడా సంయుక్తంగా క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ సాగునీటి సరఫరా పర్యవేక్షించాలన్నారు. సాగునీరు విషయమై వచ్చే వార్తలపై దృష్టి పెట్టాలని, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
also read: Sajjanar – Harsha Sai: సజ్జనార్ నెక్స్ట్ టార్గెట్ అతడే.. హెల్ప్ ముసుగులో పాపాలు అంటూ ట్వీట్..
ప్రతి మండలంలో ఉన్న అన్ని గ్రామాల బృందాలతో మండల తహసిల్దార్ వాట్సాప్ గ్రూపు తయారు చేయాలని, ప్రతి రోజూ నీటి విడుదల షెడ్యూల్ షేర్ చేయాలన్నారు. మండలంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ ముందు నీరు అందేలా చూడాలన్నారు.నీటి కాల్వల వద్ద నీటిని బ్లాక్ చేయకుండా చూడాలని, ఎక్కడైనా గేట్ బ్లాక్ చేస్తే వెంటనే పోలీసు అధికారులతో సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో యాసంగి పంటల సాగుపై రివ్యూ పెట్టుకోవాలన్నారు.
రైతులకు కాలువల క్రింద సాగునీరు అందుతుందా, బావులు, మోటార్ల ఆధారంగా సాగు చేసుకుంటున్న పంటల పరిస్థితి, ఎండిపోయిన బోర్లకు పక్కన ఇతర బోర్ల నుంచి సాగునీటి సరఫరాకు అవకాశం ఉందా చర్చించు కోవాలని కలెక్టర్ తెలిపారు. డివిజన్ స్థాయిలో రెవెన్యూ డివిజన్ అధికారి నాయకత్వంలో ఏడిలు, ఏసిపి, విద్యుత్ అధికారులు, డీఈ, ఎస్ఈ ఇరిగేషన్ అధికారులు కూడా రివ్యూ చేయాలని, ఆర్డిఓ లకు క్షేత్ర స్థాయి పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు డా. పి.శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, నీటిపారుదల శాఖ ఎస్ఇ లు వాసంతి, వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Vijayashanthi: రాములమ్మ రాకతో.. ఆ పార్టీకి గడ్డుకాలమేనా?