తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ:Brs social media: సోషల్ మీడియా కాదు అది క్షుద్రవిద్య దాని బండారం తీస్తం దాంట్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు తీసి పొయిల పెడతం అంటూ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మూడేండ్ల క్రితం వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై విమర్శలకు ఇప్పుడు అదే సోషల్ మీడియాను బీఆర్ఎస్ ప్రధాన వేదికగా ఎంచుకున్నది. అధికారంలో ఉన్నప్పుడు క్షుద్రవిద్యగా కనిపించిన సోషల్ మీడియా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధాన వేదికగా మారింది. సీఎంగా ఉన్నంతకాలం ట్విట్టర్ (ఎక్స్) జోలికి వెళ్ళని కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే సోషల్ మీడియాపై మరో రకంగా స్పందించారు. “కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానెళ్ళు ఏర్పాటుచేసి కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సింది. అని ఓ నెటిజెన్ చేసిన పోస్టుకు స్పందనగా వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2022న ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను విమర్శిస్తూ మీడియా సమావేశంలో జర్నలిస్టు స్వాతి చతుర్వేది రాసిన ‘ఐ యామ్ ఏ ట్రోల్’ అనే పుస్తకాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.
ALSO Read: Minister Sridhar Babu: గతంలోలా కోతలుండవ్.. పక్కా లెక్కలున్నాయ్.. మంత్రి శ్రీధర్ బాబు
బీజేపీ సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఎండగట్టినందుకు ఆమెను ఆ పార్టీ కేడర్ ట్రోల్ చేస్తున్నదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ డిజిటల్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియా వేదికగా ఆమెపై బీజేపీ శ్రేణులు విషం చల్లుతున్నారని, ఆమె రాసిన పుస్తకాన్ని పాత్రికేయులందరూ చదవాలని సూచించారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలకు నిధులు ఇస్తున్నది కేంద్రమేనంటూ బీజేపీ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నదని, ‘మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డే’ అనే తీరులో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వాస్తవాలకు విరుద్ధంగా, నిజాలను వక్రీకరించే విధంగా బీజేపీ క్షుద్ర రాజకీయానికి పాల్పడుతున్నదని, మౌనంగా ఉండాలా అని కామెంట్ చేశారు.
మాటలు అలా.. చేతలు ఇలా:
ఒకనాడు క్షుద్రవిద్య అని నిందించిన సోషల్ మీడియానే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన వేదికగా ఎంచుకున్నది. కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో పోలీసులు గుర్తించిన 25 కాంట్రొవర్సీ సోషల్ మీడియా పోస్టుల్లో (ట్విట్టర్) 14 బీఆర్ఎస్‌కు అనుబంధంగా ఉన్నవే. కొన్ని ‘కేసీఆర్ అడ్డా’అనే పేరుతో ఉంటే మరికొన్ని ‘బీఆర్ఎస్ తెలంగాణ సైన్యం, ఇంకొన్ని ‘తెలంగాణ వాయిస్’, ‘తెలంగాణ ఫసక్’, ‘తెలంగాణ ఉద్యమ జ్యోతి’ తదితర పేర్లతో ఉన్నాయి.
క్షుద్రవిద్య అని ఆనాడు తూర్పారబట్టిన ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలనే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలకు, సొంత పార్టీ ప్రచారానికి బీఆర్ఎస్ వినియోగిస్తున్నది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ట్విట్టర్ (ఎక్స్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర ప్లాట్‌ఫామ్‌లలో వందల సంఖ్యలో బీఆర్ఎస్‌కు అనుబంధంగా కొత్త అకౌంట్లు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ కేటీఆర్ డైరెక్షన్‌లో పనిచేస్తున్నాయన్నది ఆ పార్టీ కేడర్ మాట.
అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా క్షుద్రవిద్యగా కనిపించిన కేసీఆర్‌కు ఇప్పుడు బలమైన ప్రచార సాధనంగా కనిపించడమే విడ్డూరం. అందుకే కేసీఆర్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ శ్రేణులే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్నప్పుడు సొంతగా ట్విట్టర్ ఖాతా జోలికెళ్ళని కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత యాక్టివ్ కావడాన్ని జీర్ణించుకోలేకపోయాయి. క్షుద్రవిద్య అని విమర్శించిన ఆ వేదికనే ఇప్పుడు వాడడంలోని అంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోయాయి.
జర్నలిస్టు స్వాతి చతుర్వేదికి సంఘీభావాన్ని తెలుపుతూ, ఆమె రాసిన పుస్తకాన్ని పాత్రికేయులందరూ చదవాలని సూచించిన కేసీఆర్ ఇప్పుడు దానికి విరుద్ధమైన ఆచరణను ఎంచుకోవడం ఆ పార్టీ శ్రేణులకే అంతుచిక్కలేదు. ఇక ట్విట్టర్‌ను మొదటి నుంచీ విస్తృతంగా వినియోగించుకుంటున్న కేటీఆర్‌కు ‘ట్విట్టర్ టిల్లు’ అని బండి సంజయ్ నిక్ నేమ్ పెట్టారు.
Also Read: Bhu Bharati Portal: తెలంగాణలో కొత్త చట్టం.. రేపటి నుండే అమలు!