తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: KCR on HCU: ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కళ్లముందు కనిపిస్తున్న స్పందనే నిదర్శనమని, ఈ ఉదంతం ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. చేతిలో అధికారం వుందనే ధోరణితో నోటికొచ్చినట్టు మాట్లాడినా, ఇష్టారీతిలో వ్యవహరించినా అటు న్యాయస్థానాలు, ఇటు సభ్య సమాజం, విద్యార్థి లోకం తిప్పికొడతాయని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే వివిధ సెక్షన్ల ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నదని, కొన్నిచోట్ల వ్యతిరేకత కూడా వ్యక్తమవుతున్నదని వ్యాఖ్యానించారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సిల్వర్ జూబ్లీ వేడుకగా నిర్వహించాలని నిర్ణయించిన కేసీఆర్ అన్ని జిల్లాల నేతలతో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల లీడర్లకు దిశానిర్దేశం చేసిన అనంతరం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.
Also Read: CM Revanth Reddy: ఫేక్ వీడియోలపై సీఎం రేవంత్ సీరియస్.. ఫేక్ గాళ్లకు ఇక చుక్కలే !
సాగునీటి కాల్వల్లో కేసీఆర్ నీళ్లు రావడంలేదంటూ చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆవేదనతో ఉన్నారని, గతంలో ఎండకాలంలోనూ నిండుకుండల్లా మత్తడి దుంకిన చెరువులు, కుంటలు ఇప్పుడు పశువులకు కూడా నీళ్లు ఇవ్వలేని స్థితికి చేరుకున్నాయని ఉదహరించారు. సాగునీరు అందుతుందనే ఆశతో యాసంగిలో వరి నాట్లు వేసిన రైతాంగం నీరందరక పొట్టకొచ్చిన పొలాలను పశువుల మేతకు వదిలేసుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ అసమర్థత మూలంగా రైతులు వ్యవసాయ దుస్థితిపై ఆవేదనతో ఉంటే విద్యార్థులు యూనివర్శిటీ భూముల విషయంలో, పర్యావరణం అంశంలో ప్రభుత్వంపైన ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.
గతంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని, ఇప్పుడు పాలన కుంటుపడడంతో మెయింటెనెన్స్ లేక, డీజిల్ లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయని, సఫాయి కార్మికులకు జీతాలు అందక పారిశుధ్యం పడకేసిందని పార్టీ నేతలు అధినేతకు వివరించారు. అధికారం కోసం అలవిగాని హామీలిచ్చి, గ్యారెంటీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా గుణాత్మక మార్పు ఏమీ లేదని వారికి కేసీఆర్ వివరించారు. తెలంగాణ ప్రజల పాలిట కాంగ్రెస్ శాపంగా మారిందని వ్యాఖ్యానించారు.
ఇంకా దిగజారి వ్యవహరిస్తూనే ఉంటారని, మనం ఆవేశానికి గురికావద్దని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మల్లించే ప్రభుత్వ ఆచరణను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వారికి వివరించారు. ప్రజలు గత పాలనను, ఇప్పుడు అనుభవిస్తున్న అంశాలను పోల్చి చూసుకుంటారని, వారే ఒక అంచనాకు వస్తారని అన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/