Phone Tapping Case: గుంపుమేస్త్రీ, గుంటనక్క డ్రామా
పురపోరులో బీసీలు రిజర్వేషన్లు అడగకుండా డైవర్షన్
నా లాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు
బీసీ కులగణనలో బీసీలను తక్కువ చూపి కాంగ్రెస్ మోసం
కేంద్రం చేపట్టే కులగణన మోసాన్ని బయటపెడతాం
బీసీలకు అన్యాయం జరగకుండా నివేదిక సిద్ధం చేస్తాం
త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం
మా ప్రయత్నంలో బీసీ మేధావులు కలిసి రావాలి: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై (Phone Tapping Case) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) బుధవారం స్పందించారు. ఈ వ్యవహారం గుంపుమేస్త్రీ, గుంటనక్క ఆడుతున్న డ్రామా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు రిజర్వేషన్లు అడగకుండా డైవర్షన్ అని, తన లాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లడారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ముచ్చర్ల సత్యనారాయణ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారని కవిత అన్నారు. ఆయనలాంటి ఎంతో మంది ఉద్యమ నేతలకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ముచ్చర్ల విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద పెట్టాలని డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి వస్తే శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతిని అఫిషీయల్ గా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ జాతి మొత్తాన్ని జాగృతం చేసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ ఫస్ట్ అన్నదే మా నినాదం.. తెలంగాణ మంచి కోసం పనిచేసిన వారు ఏ పార్టీలో ఉన్న వారి స్ఫూర్తిని తీసుకుంటామన్నారు.
ట్యాంక్ బండ్ పై మన తెలంగాణ వారి విగ్రహాలు లేవు అన్నారు. ఆంధ్రా నాయకుల విగ్రహాలు తీసేయమనటం లేదు.. అవసరమైన నాడు తప్పకుండా తీసేద్దాం అన్నారు. కానీ మన తెలంగాణ వారి విగ్రహాలు కచ్చితంగా ట్యాంక్ బండ్ పై ఉండాలని డిమాండ్ చేశారు. అమరజ్యోతి కి అవినీతి మరకలు అంటాయని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పటి వరకు దానిపై విచారణ జరపలేదు. అమరజ్యోతిని పట్టించుకోవటం లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జయంతి, వర్ధంతులు జరపటం లేదని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి తప్పకుండా ఒక రోజు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వాదానికి సెంటర్ పాయింట్ గా అమరజ్యోతిని కేంద్రం చేస్తామని, విద్యార్థులందరికీ ఉద్యమకారుల త్యాగాలను తెలిసేలా చేస్తామన్నారు. సామాజిక తెలంగాణ కోసం ముచ్చర్ల ఎంతో కృషి చేశారని, ఆయన బాటలోనే మనం నడుద్దామని పిలుపు నిచ్చారు. ముల్కీ ఉద్యమం నుంచి తొలి, మలి దశ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారన్నారు.
Read Also- Municipal Politics: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు
బీసీలకు గ్రామపంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్ మాట ఎత్తకుండానే ముందుకు వెళ్తోందని మండిపడ్డారు. ఈ విషయాన్ని బీసీలు ప్రశ్నించకుండా ఉండేందుకు గుంపుమేస్త్రీ, గుంటనక్క కలిసి డ్రామా చేస్తున్నారని, కావాలనే ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఈ విచారణతో ఏమీ జరగదన్నారు. బీసీల కోసం బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించటం లేదు? అని నిలదీవారు. కాంగ్రెస్ బీసీలకు న్యాయం చేయాలన్న విషయాన్నే ఆలోచించటం లేదన్నారు. కచ్చితంగా ఈ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చాకే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మెజార్టీగా ఉన్న ప్రజలకు రాజ్యాధికారం ఉన్నప్పుడే న్యాయం జరుగుతుందన్నారు.
జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించలేదని, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, యువత, మహిళలు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే వారికి మద్దతిస్తామన్నారు. నాతో పాటు జాగృతి నాయకులు వారి కోసం ప్రచారం నిర్వహిస్తామన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మున్సిపల్ ఎన్నికలు ఉపయోగించుకోవాలని సూచించారు. బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేస్తోందన్నారు. జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు జరగటం సాధ్యం కాదన్నారు. కానీ ఎప్పుడు పునర్విభజన జరిగిన సరే సికింద్రాబాద్ ను జిల్లా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కులగణనలో బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని, బీసీ కులాల జనాభాను తక్కువ చూపి మోసం చేసిందన్నారు. కేంద్రం చేయనున్న కులగణన ద్వారా కాంగ్రెస్ చేసిన మోసాన్ని బయటపెట్టే అవకాశం వచ్చిందని, కానీ జాగృతి తరఫున మేము ప్రతి కులానికి సంబంధించిన సమాచారం సేకరిస్తామన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా నివేదిక సిద్ధం చేస్తామని, త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తాం.. మా ప్రయత్నం నచ్చితే బీసీలు, బీసీ మేధావులు మాతో కలిసి పనిచేయండి అని కోరారు.

