Kavitha’s Maha Dharna: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)కు కాళేశ్వరం కమీషన్ (Kaleshwaram Commission) ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని కేసీఆర్ కుమార్తె కవిత (Kalvakuntla Kavitha) తీవ్రంగా తప్పుబడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్య శ్యామలం చేసినందుకు నోటీసులు ఇచ్చారా? అంటూ ఆమె పదే పదే ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 4న అంటే రేపు కవిత మహా ధర్నాకు పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహా ధర్నాలో పెద్ద ఎత్తున కవిత అనుచరులు పాల్గొనే అవకాశముంది.
మహాధర్నాలో కాంగ్రెస్‌పై ప్రశ్నలు!
హైదరాబాద్ ఇందిరా పార్క్ (Indira Park) వద్ద గల ధర్నా చౌక్ (Dharna Chowk) ప్రాంతంలో రేపు ఉదయం 10 గం.లకు కవిత మహా ధర్నా చేపట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఇది కొనసాగనుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరగనున్న ఈ నిరసన కార్యక్రమానికి.. భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి కేసీఆర్ అభిమానులు, జాగృతి శ్రేణులు తరలి రానున్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడే అవకాశముంది. ప్రాణహిత – చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందో ఆమె తెలియజేయనున్నారు. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు.. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవున పెట్టడంతో ఏటా యాసంగి సీజన్ లో రైతాంగానికి జరుగుతోన్న నష్టం గురించి ఆమె ప్రశ్నించే అవకాశముంది. కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తోన్న రాజకీయాలపై వక్తలు ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ శ్రేణులు వస్తారా?
గత కొన్ని రోజులుగా కవిత అంశం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కు కవిత లేఖ రాయడం, ఆపై తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించడం రాష్ట్రంలో దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలోనే ఆమె త్వరలో కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే కవిత చేస్తున్న వరుస కామెంట్స్ తో బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందని ఆ పార్టీ నేతలు, శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత చేపట్టిన మహా ధర్నాకు వారు హాజరవుతారా? లేదా తమకు సంబంధం లేనట్లు సైలెంట్ అయిపోతారా? అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తమ పార్టీ అధినాయకుడి కోసం చేస్తున్న ధర్నా కావడంతో మనసు మార్చుకొని అయినా బీఆర్ఎస్ క్యాడర్ (BRS Cadre) వెళ్తారేమోనన్న చర్చ జరుగుతోంది.
Also Read: IPL Final Closing Ceremony: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. ఈసారి ముగింపు వేడుకలు ధూమ్ ధామే!
నోటీసులపై కీలక నిర్ణయం
కాళేశ్వరం నోటీసులకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్-5న కమిషన్ ముందు విచారణ హాజరు కావాల్సి ఉండగా.. ఆయన జూన్ 11న వస్తానని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అటు కమిషన్ సైతం కేసీఆర్ విజ్ఞప్తికి ఓకే చెప్పినట్లు తెలిసింది. విచారణ తేదీని సైతం 11వ తేదీకి మార్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేత హరీష్ రావు (Harish Rao), బీజేపీ నేత ఈటల రాజేందర్ (Etela Rajender) కు సైతం కమిషన్ నుంచి నోటీసులు వెళ్లాయి. వారిని హరీశ్‌రావును జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది.