Kavitha: ఆదివాసీల హక్కుల కోసం త్వరలోనే తెలంగాణ జాగృతి (Telangana Jagruti) ఆధ్వర్యంలో పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణజాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు. కొమురం భీమ్ వర్థంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ పై ఉన్న భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ మన్నెం పులి, ఆదివాసీ బొబ్బిలి కొమురం భీమ్ అని కొనియాడారు. తమ జాతి కోసం ఎలా పోరాటం చేయాలో దేశం మొత్తం తరతరాలు చెప్పుకునేలా గొప్ప పోరాటం చేసిన వ్యక్తి కొమురం భీమ్ అన్నారు. కొంతమంది జననం చరిత్ర అయితే.. కొంతమంది మరణం చరిత్ర అవుతుందన్నారు. కొమురం భీమ్ తన మరణంతో ఆదివాసీలకు ఎన్నో హక్కులను పర్మినెంట్ గా సాధించి పెట్టారన్నారు.
Also Read: Bhadrachalam: ఆదివాసీ విప్లవ వీరుడు.. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కొమరం భీమ్
మా గూడెంలో మా రాజ్యమే ఉండాలి
మావా నాటే మావా రాజ్’ అంటే మా గూడెంలో మా రాజ్యమే ఉండాలని ఆయన పిలుపునిచ్చారన్నారు. జల్, జంగిల్, జమీన్ అనగా నీరు, అడవి, భూమి మీద ఆదివాసీలకే హక్కు ఉండాలని పోరాటం చేశారన్నారు. నిజాం ప్రభుత్వాన్ని తలవంచేలా చేసి ఆదివాసీలు తమ సమస్యలు చెప్పుకునేలా దర్బార్ నిర్వహించేలా చేశారన్నారు. ఇప్పటికీ కొమురం భీమ్ గౌరవార్థం ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నమంటే అది ఆయన గొప్పతనం అన్నారు. కొమురం భీమ్ కి జోడే ఘాట్ వద్ద స్మృతి వనం నిర్మించుకున్నామన్నారు. తెలంగాణ వచ్చాక ఆయనకు తగిన గౌరవం ఇచ్చుకున్నామన్నారు.
ఏటా ప్రతి గూడానికి రూ. 25 వేలు
గుస్సాడీ ఉత్సవాల కోసం గత ప్రభుత్వం ఏటా ప్రతి గూడానికి రూ. 25 వేలు ఇచ్చేదాని, కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని ఈ ఉత్సవాల కోసం రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఉత్సవాలు ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వచ్చాక గూడెలలో అభివృద్ధి ఆగిందని ఆరోపించారు. మహిళలకు కనీసం ప్రసూతి సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్యలపై కొమురం భీమ్ స్ఫూర్తితో జాగృతి పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఆదివాసీ జాగృతి అధ్యక్షుడు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు.
Also Read: TSLPRB Recruitment 2025: TSRTC రిక్రూట్‌మెంట్ 2025.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల కోసం దరఖాస్తులు
