కరీంనగర్-మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఫిబ్రవరి 27న జరిగిన పోలింగ్ లో మొత్తం 2,50,106 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ (BJP ) తరఫున అంజిరెడ్డి (Anjireddy) , కాంగ్రెస్ (Congress) నుంచి నరేందర్ రెడ్డి (Narender Reddy) అలాగే బీఎస్పీ (BSP) నుంచి ప్రసన్న హరికృష్ణ (Prasanna Harikrishna) బరిలో ఉన్నారు. లెక్కింపులో భాగంగా అధికారులు అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. మెదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697, కాంగ్రెస్ అభ్యర్థి 6,673, బీఎస్పీ క్యాండెట్ ప్రసన్న హరికృష్ణ 5,897 ఓట్లు పోలయ్యాయి.తొలి రౌండ్ ముగిసే సమయానికి అంజిరెడ్డి 24 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ముగ్గురు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో, నల్గొండ జిల్లాలోని ఆర్జాలబావిలో కౌంటింగ్ జరుగుతోంది.
ఇక, సోమవారం విడుదలైన టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల్లో ఒక చోట బీజేపీ అభ్యర్థి, మరో చోట పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. అలాగే ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి గెలుపొందారు.
ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25.041 ఓట్లు పోలవగా 24, 144 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. మిగిలిన 897 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 15 మంది బరిలో నిలిచినప్పటికీ మల్క కోమరయ్య (Malka komaraiah) మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం వరించింది. ఆయన పీఆర్టీయూ(టీఎస్) అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి (Vanga Mahender Reddy)పై 5,777 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
ఇక, ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గంలో పీఆర్టీయూ(టీఎస్) రాష్ట అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్ రెడ్డి (Pingili Sripal Reddy) రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపోందారు. యూటీఎఫ్ బలపరిచిన సిటింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి (Narsireddy) రెండో స్థానంలో నిలిచారు. కాగా, పోలైన ఓట్లలో 50 శాతానికి మించి ఓట్లు సాధించినవారు విజేతలుగా నిలుస్తారు.
ఏపీలో కూటమి హవా…
ఏపీలో విడుదలైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులను విజయం వరించింది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. తొమ్మిది రౌండ్ల పాటు లెక్కింపు జరగ్గా ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. చెల్లుబాటు అయిన ఓట్లలో 60 శాతం పైగా ఓట్లు ఆలపాటికి రావడం విశేషం. అలాగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులునాయుడు గెలుపొందారు. ఇక్కడ మేజిక్ ఫిగర్ 10,068 ఓట్లు కాగా.. ఆయనకు 12,035 ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
ఇక, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. ఏడో రౌండ్ లోనే విజయానికి కావాల్సిన 51శాతం ఓట్లు రావడంతో మరో రౌండ్ లెక్కింపు ఉండగానే ఆయన గెలిచినట్లు ప్రకటించారు అధికారులు.