Kalvakuntla Kavitha: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు సాధించేవరకు పంతం వీడేది లేదు.. మడమ తిప్పేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రిజర్వేషన్లు కల్పించకపోతే రణరంగాన్ని సృష్టిస్తామని తేల్చిచెప్పారు. ఇది రాజకీయ పోరాటం కాదని, బీసీల ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటమని స్పష్ట చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులో ముస్లింలకు కూడా వాటా ఉందన్న అనుమానం ఉందని, దాన్ని ఆపుతున్నామని బీజేపీ నాయకులు చెప్పడంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో సోమవారం నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్షకు కుల సంఘాలు, ప్రజా సంఘాలు హాజరై మద్ధతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లకు సపరేట్ బిల్లును పెడుతామని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలు బాగునప్పుడే తెలంగాణ బాగుటుందని తెలిపారు. ప్రతీ ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి, అందరికీ ఆర్థిక అవకాశాలు, సమాజంలో గౌరవం దక్కాలని, సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు రాజకీయంగా సమప్రధాన్యత దక్కాలి అని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం యాథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్రానికి పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందామని చూస్తోందని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేమో ఇది రాష్ట్రానికి సంబంధించి బిల్లు అని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ల కోసం వేరే బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. స్పష్టత ఇవ్వాలని కానీ, బీసీలను మోసం చేయవద్దని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు సపరేట్ గా ముస్లీంలకు 10 శాతం రిజర్వేషన్లను తీసుకురావాలని, అప్పుడు బీజేపీ ప్రభుత్వం బిల్లుపై సంతకం చేయకపోతే ఢిల్లీకి పోయి కూడా ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల దీక్ష చేస్తున్నామని, ఇది రాజకీయ పోరాటం కాదని, ఇది ఆత్మగౌరవ పోరాటమని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ ప్రతిపాదించిన అహింసా మార్గంలో బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది అని చెప్పారు. 72 గంటల నిరాహార దీక్ష కోసం అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ఎన్ని రోజులైనా ఆపండి.. అర్జంట్ ఏముంది ఎన్నికలకు ? రెండేళ్ల నుంచి సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఉన్నారా ? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటి అభివృద్ధి జరగుతోందా ఇప్పుడు ? మరి ఎన్నికలకు అంత అర్జంట్ ఏముంది ? బీసీలకు రిజర్వేషన్లు సాధించాకే ఎన్నికలు పెట్టండి అని సూచించారు. హైకోర్టును దీక్షకు అనుమతి కోరితే .. ప్రభుత్వం మాత్రం వాయిదా వేయాలని హైకోర్టుకు సూచించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు అనుమతి ఇవ్వలేదని, తెలంగాణ జాగృతి క్రమశిక్షణ గల సంస్థ అని కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ దీక్షను విరమిస్తున్నానని ప్రకటించారు.
ఇది విరమణ కాదు.. విరామం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూబీసీల తరపున పోరాటం కోనసాగిస్తామన్నారు. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే వెనక్కి తగ్గినట్టు కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం ఆగదని అనేక రూపాల్లో కొనసాగిస్తామన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ టైం పాస్ ధర్నాలు చేస్తున్నదని వాటితో సాధించేది ఏమీ లేదన్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ ను తొక్కి పెట్టిన గవర్నర్ పై సుప్రీం కోర్టులో కేసు వేయాలన్నారు. ఢిల్లీలో టైమ్ పాస్ ధర్నాలు చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరని హెచ్చరించారు. బీసీ సంఘాలు, నాయకులతో సమాలోచనలు చేసి మరో రూపంలో పోరాటం చేస్తామన్నారు. లోకల్ బాడీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఎన్నికలు ఎట్లా ఆపాలో తమకు తెలుసు అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో కేసీఆర్ పేరును 36 సార్లు ప్రస్తావించినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కమిషన్ అని తాము ధర్నా చౌక్ వేదికగానే ఎత్తిచూపామన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కమిషన్ నివేదిక పేరుతో రాజకీయాలు చేస్తోందన్నారు. నిపుణుల కమిటీ సూచనలమేరకు నిర్మాణాలు జరిగాయన్నారు. ప్రాజెక్టులో అత్యధిక టెండర్లు దక్కించుకున్న మేఘా కృష్ణా రెడ్డిని ఎందుకు విచారించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.