Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సోయిలేని ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేదని కవిత.. ఆయన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనకపోవడం విచిత్రంగా అనిపించిందని చెప్పారు. గిన్నిస్ రికార్డు కోసమే బతుకమ్మ పండుగ చేశారని.. ఆడబిడ్డలకు చీరలు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని కవిత అన్నారు. వచ్చే ఏడాది లక్షమంది మహిళలతో బతుకమ్మ నిర్వహించి.. రికార్డ్ బ్రేక్ చేస్తామని చెప్పారు.
బీసీ రిజర్వేషన్లపై..
బీసీ బిల్లులకు రాజకీయ పరమైన రిజర్వేషన్లకు ఇబ్బంది వస్తుందని కవిత అన్నారు. ‘విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు రావు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి రేవంత్ రెడ్డి దగ్గరి మనుషులు కోర్టుల్లో కేసులు వేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాల్సిన బీజేపీ ఎన్నికలు జరిగితే కోర్టుల్లో క్యాన్సిల్ చేస్తామని అంటోంది. ఈటెల రాజేందర్ ఎన్నికల్లో పోటీ చేయవద్దు అని అంటున్నారు. బీజేపీ ఏమైనా కోర్టునా? ఈటెల రాజేందర్ బీసీ బిడ్డ. ఆయన ఈ విధంగా ఎలా మాట్లాడతారు? అని కవిత నిలదీశారు. ఈటెల రాజేందర్ మాటలు వ్యక్తిగతమా బీజేపీ స్టాండా చెప్పాలని పట్టుబట్టారు. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఆర్డినెన్స్ గురించి బీజేపీ మాట్లాడాలని కవిత పట్టుబట్టారు. దిల్లీ వెళ్లి మోదీ కాళ్ళు పట్టుకుని బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తేవాలని డిమాండ్ చేశారు.
‘ఈటల క్షమాపణలు చెప్పాలి’
తండా గ్రామ పంచాయతీలో ఒక్క ఎస్సి లేకపోయినా ఎస్సికి రిజర్వ్ చేశారని కవిత మండిపడ్డారు. ‘కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్టీలు లేకపోయినా ఎస్టీలకు సర్పంచ్ పదవి రిజర్వ్ చేశారు. గ్రామ పంచాయతీల వారీగా కులాల లిస్ట్ పెట్టి ఎవరు ఎక్కువ ఉంటే రిజర్వేషన్లు వారికి ఇవ్వాలని చెప్పాము. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో అమలు కాలేదు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసి ఏం ఉపయోగం. బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ చేస్తారా? లేదా? బీజేపీ చెప్పాలి. ఈటల రాజేందర్ బీసీలకు క్షమాపణ చెప్పాలి. బీజేపీ తెలంగాణ బీసీలకు క్షమాపణ చెప్పాలి. ఈటల రాజేందర్.. మీపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు’ అని కవిత సూచించారు.
Also Read: School Principal: బ్యాంక్ చెక్‌లో అక్షర దోషాలు.. అడ్డంగా బుక్కైన ప్రిన్సిపల్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
జూబ్లీహిల్స్ ఎన్నికలపై..
అక్టోబర్ 8వ తేదీన కోర్టు తీర్పును బట్టి జాగృతి కార్యాచరణ ఉంటుందని కవిత స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము. నిజామాబాద్ ఎంపీ అరవింద్ నాకు సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై ఇంకా జాగృతి నిర్ణయం తీసుకోలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊహించనిది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలతో ప్రజల జీవితాల్లో మార్పులు రావు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ప్రజల ఆస్తి. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయాలని తెలంగాణ వాదులు అందరూ కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతోంది’ అని కవిత మండిపడ్డారు.
LIVE: Addressing media https://t.co/dfQRQVzrB0
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 1, 2025