Jupally Krishna Rao : ఎస్ ఎల్ ఎబీసీ (Slbc) టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురు మృతదేహాలను కనిపెట్టినట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మిగతా నలుగురి మృతదేహాలను టీమీఎం మిషిన్ తో కనిపెడుతున్నామన్నారు. ఆ నలుగురు టీమీఎం మిషిన్ కు అవతలి వైపు ఉన్నట్టు మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. మార్చి 2 ఆదివారం రాత్రి వరకు అందరినీ వెలికి తీస్తామని చెప్పుకొచ్చారు.
టన్నెల్ (Tunnel)లో 150 మంది చురుగ్గా పనిచేస్తున్నారని.. బోరింగ్ మిషిన్ ను కట్ చేసి బయటకు తీసుకొస్తున్నట్టు వివరించారు. బురదలో మూడు మీటర్ల లోపల కూరుకుపోయిన నలుగురు కార్మికులను బయటకు తీస్తున్నట్టు చెప్పారు. మిగతా నలుగురిని రేపటి వరకు బయటకు తీస్తామన్నారు. టన్నెల్ ఘటనపై రాజకీయాలు చేయాల్సిన సమయం కాదన్నారు. కార్మికులను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశామని.. దురదృష్ట వశాత్తు వారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వచ్చాయన్నారు.
ఇక టన్నెల్ వద్ద మృతి చెందిన కార్మికుల కుటుంబాలు రావడంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర విషాదంగా మారింది. వారి రోదనలతో టన్నెల్ వద్ద ఉద్విగ్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ నుంచి 8 అంబులెన్సులు అక్కడకు వచ్చాయి. మృతదేహాలను ముందుగా గాంధీ ఆస్పత్రికి పంపించి అక్కడ గుర్తింపు పరీక్షలు పూర్తి అయిన తర్వాతనే కుటుంబాలకు అప్పగించనున్నారు.