JubileeHills Bypoll: క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేస్తున్న అగ్రనేతలు
విజయం కోసం పార్టీల ప్రత్యేక స్ట్రాటజీలు
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఉత్కంఠ
లీడర్‌లకు టెన్షన్ పెడుతున్న సర్వేలు
అన్ని పార్టీల లీడర్లకూ ఇదే టార్గెట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (JubileeHills Bypoll) అన్ని పార్టీలనూ టెన్షన్ పెడుతున్నది. ఈ బై ఎలక్షన్‌పై రెండు జాతీయ పార్టీల అగ్రనేతలతో పాటు, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. విజయం కోసం అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీల పనితీరుపై ఏకంగా అగ్రనేతలు కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తుండగా, బీఆర్‌ఎస్ వర్క్‌పై ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా ఫోకస్ పెట్టారు. విజయం కోసం అన్ని పార్టీలు ప్రత్యేక స్ట్రాటజీలు అనుసరించాల్సి వస్తున్నది. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ధీమాతో ఉండగా, తామే మెజార్టీలో ఉన్నామని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి.
ఆరు సర్వేల్లో తమకే విజయం దక్కుతుందని తేలినట్టు మాజీ మంత్రి కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. తాము నిర్వహించిన సర్వేలో గెలుపు తమైపు తేలిందని బీజేపీ కూడా చెప్పుకుంటున్నది. అయితే, అన్ని పార్టీలకు సర్వేలు ఆందోళనను కల్గిస్తున్నాయి. పార్టీల వారీగా వర్క్ చేసిన సర్వే సంస్థలు.. ఆయా పార్టీలకు పాజిటివ్ రిపోర్టులు ఇస్తున్నట్లు, ఆయా లీడర్ల కామెంట్లు, ప్రకటనలు, ప్రసంగాలను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. ఒకే నియోజకవర్గంలో అన్ని పార్టీలకు లీడ్ ఎలా వస్తుందనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల మదిలో మెదులుతున్నాయి. వాస్తవానికి సర్వే సంస్థలు ప్రజల ఒపీనియన్‌ను గ్రాఫ్ రూపంలో పార్టీలకు అందజేస్తాయి. కానీ, ఎవరికి వారు ఆయా సర్వేలను అనుకూలంగా కన్వర్ట్ చేసుకుంటున్నారనే ప్రచారం కూడా ఉన్నది. సర్వే సంస్థల అంచనాలు తప్పా? లీడర్ల ప్రకటనలు తప్పా? అనేది రిజల్ట్స్ తర్వాత తేలిపోనున్నది.
కీలక సెగ్మెంట్?
హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కీలక సెగ్మెంట్‌గా గుర్తింపు ఉన్నది. రాజకీయ లీడర్లు, వ్యాపార వేత్తలు, పాపులర్ పర్సన్లు, సినీ ప్రముఖులంతా ఈ నియోజకవర్గం పరిధిలోనే అత్యధికంగా నివసిస్తుంటారు. దీంతో, ఈ నియోజకవర్గాన్ని గ్రిప్‌లోకి తీసుకోవాలని అన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయి. అంతేగాక ఈ ఉప ఎన్నిక ప్రభావం స్థానిక సంస్థలతో పాటు, రాబోయే ఎన్నికలపై కూడా చూపుతాయని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నాయి. దీంతో, ఈ సెగ్మెంట్‌లో విజయం కోసం పార్టీల పరితపిస్తున్నాయి. సుమారు 3 లక్షల ఓటర్లు ఉన్నప్పటికీ, నలభై వేల ఓటర్లు కలిగిన సామాజిక వర్గం ఈ నియోజకవర్గాన్ని శాసిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్. దీంతో ఆయ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసేందుకు అన్ని పార్టీలు తాపత్రయం పడుతున్నాయి.
సక్సెస్ మంత్ర?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏకంగా ముగ్గురు మంత్రులు, 20 మంది కార్పొరేషన్ చైర్మన్లను ఇన్‌ఛార్జీలుగా నియమించి క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, శంకుస్థాపనలు నిర్వహిస్తున్నది. ఇవన్నీ కులాలు వారీగా మీటింగ్‌లు, సమ్మేళనాలు నిర్వహించి పబ్లిక్‌లో పాజిటివ్ వేవ్‌ను క్రియేట్ చేసుకుంటుంది. ఇది తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నది. పదేళ్లు పవర్‌లో ఉండి, జూబ్లీహిల్స్‌కి ఏ కష్టం రానీయలేదని బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తున్నది. స్వయంగా మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఉప ఎన్నికను టాస్క్‌గా తీసుకున్నారు. బూత్ లెవల్ వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించి సమన్వయం చేస్తున్నారు. గోపినాథ్ కుటుంబానికి అండగా ఉండాలని సెంటిమెంట్‌ను క్రియేట్ చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు డెవలప్ చేయడమే తెలియదని, మోదీ చరిష్మాతో రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండాను ఎగుర వేస్తామని బీజేపీ ప్రచారం చేస్తున్నది. ఈ రెండు పార్టీలు కమీషన్లకే ప్రియారిటీ ఇస్తాయని, బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆ పార్టీ పబ్లిసిటీ చేస్తున్నది. అయితే ఏ పార్టీకి లాభం జరుగుతుందనేది త్వరలోనే తేలనున్నది.