Jubileehill bypoll: తెలుగు రాష్ట్రాల ప్రజానీకం ఆసక్తికరంగా గమనిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నిక పూర్తయింది. ముగింపు సమయం 6 గంటల కల్లా క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. అయితే, పోలింగ్ ముగింపు సమయంలో నియోజకవర్గంలోని కృష్ణానగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పోలింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించడంతో అక్కడి పరిస్థితి రచ్చరచ్చగా మారిపోయింది.
మాగంటి సునీతకు అనుకూలంగా బీఆర్ఎస్ నేతలు సైతం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి, నినాదాలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి కూడా అక్కడే ఉన్నారు. దీంతో, బీఆర్ఎస్ శ్రేణులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కూడా నినాదాలు చేశారు. దీంతో, కృష్ణానగర్ పోలింగ్ బూత్ వద్ద వాతావరణం కాసేపు రణరంగాన్ని తలపించింది. ఆ తర్వాత మాగంటి సునీతను పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. ప్రత్యేక వాహనంలో తరలించారు. ఇక, నవీన్ యాదవ్ తండ్రిని కూడా పంపించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
కాగా, కృష్ణానగర్ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నేతలు ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు వేశారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె మద్దతుదారులు ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లు రిగ్గింగ్ చేస్తున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ చేశారు.
Read Also- Huzurabad: విద్యార్థులతో ధ్యాన మహాయజ్ఞం.. ఏకాగ్రత కోసం ధ్యానం నిత్యకృత్యం కావాలి : కమిషనర్ సమ్మయ్య
