Jagityal District: నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డపైనే కన్నతల్లి, కర్కశత్వంతో నిత్యం గొడ్డును బాదినట్లు బాదుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాయికల్ మండలం అయోధ్యకు చెందిన రమను జగిత్యాల పట్టణంలోని తులసీనగర్‌కు చెందిన ఆంజనేయులు రెండో వివాహం చేసుకున్నాడు.
కొద్ది రోజులకు బ్రతుకుదెరువు నిమిత్తం ఆంజనేయులు దుబాయి వెళ్లగా రమ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సంవత్సరం క్రితం దుబాయి నుండి వచ్చిన భర్తతో రమ రోజూ గొడవ పడ్తుండటంతో విసిగిపోయిన ఆంజనేయులు తిరిగి దుబాయి వెళ్లిపోయాడు. రమ తన రెండేళ్ల కొడుకుతో ఇంటి వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది.
Also read: BRS BJP Alliance: బీజేపీ – బీఆర్ఎస్ పొత్తు.. సభ వేదికగా కేసీఆర్ హింట్స్.. టార్గెట్ హైదరాబాద్!
కొద్ది రోజులుగా బాలుడిని తరచూ తీవ్రంగా కొట్టడం, తన్నడం చేస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేశారు. స్పందించిన పోలీసులు సంబంధిత అధికారులతో రమ ఇంటికి చేరుకుని ఆమెతో పాటు బాలుడిని సఖీ కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలుడుని అమ్మమ్మ, తాతలకి అప్పగించారు. మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించిన అధికారులు రమకి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.