Rains in Telugu States: గత కొద్దిరోజులుగా భానుడి భగ భగలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కాస్త ఉపశమనం లభించనట్లైంది. గురువారం సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షం (Brought rain) కురుస్తోంది. ముఖ్యంగా శుక్రవారం రాత్రి.. హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల పడ్డాయి. రైతులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ వర్షం ప్రభావంతో శనివారం ఉదయం రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా చల్లని వాతావరణం ఏర్పడింది. ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోమారు రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పింది.
మరో రెండ్రోజులు వర్షాలు
భారీ ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఉపశమనం లభించడంతో తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ హైదరాబాద్ వాతావరణం కేంద్రం మరో తీపి కబురు చెప్పింది. రాబోయే రెండ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురవనున్నట్లు అంచనా వేసింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆ జిల్లాల్లో వడగళ్ల వాన
మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలో అక్కడక్కడ వడగళ్ల వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అభిప్రాయపడింది. ఈ జిల్లాలో ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని తెలిపింది.
హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం
శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైదర్‌నగర్, మూసాపేట్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, బోరబండ, బేగంపేట, మియాపూర్, నిజాంపేట, కూకట్‌పల్లి, ప్రగతి నగర్, బాచుపల్లి, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, ప్యారడైజ్, చిలకలగూడ, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో కొన్ని చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. అయితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ఏరియాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చొచ్చుకు రావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవాళ కూడా నగరంలో వర్షం పడే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
Also Read: Minister Bhatti Vikramarka: అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఎండగట్టిన భట్టి విక్రమార్క.. గత వైఫల్యాలపై ప్రశ్నల వర్షం
ఏపీలో 4 రోజులు వర్షం
ఆంధ్రప్రదేశ్ కు సైతం వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అభిప్రాయపడింది. గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులు సైతం పడతాయని హెచ్చరించింది. ఈ నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉందని చెప్పింది.