Telangana Secretariat: రాష్ట్ర పరిపాలన కేంద్ర బిందువైన సచివాలయం ముందు చిరు వ్యాపారులకు జీవనోపాధి కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. స్ట్రీట్ వెండింగ్ పాలసీ కింద ఇక్కడ వ్యాపారాలకు అవకాశమివ్వటంతో భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్)కు చెందిన కొందరు నేతలు దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనియన్ నేతలు, కొందరు పాత వ్యాపారులు రింగ్‌గా ఏర్పడి కొత్త వారికి వెండర్ కార్డులు రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 160 మంది చిరు వ్యాపారులు కుటుంబాలను పోషించుకుంటుండగా, వారి నుంచి ఒక బీఎంఎస్ నేత నెలసరి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ సంకల్పాన్ని పక్కదారి పట్టిస్తూ కార్మిక నేతలు చేస్తున్న ఈ దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సెక్రటేరియట్ సాక్షిగా దందా
సచివాలయం ముందు కొత్తవారు వ్యాపారం చేసుకోకుండా యూనియన్ నేతలు చక్రం తిప్పుతున్నారు. వెండర్స్ కార్డుల కోసం ప్రయత్నించే వారిని బీఎంఎస్ నేతలు ఇతర యూనియన్లతో కలిసి అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ వ్యాపారం చేయాలంటే బీఎంఎస్ యూనియన్ అనుమతి తప్పనిసరి అనే అనధికారిక నిబంధనను పెట్టి అందినంత దండుకుంటున్నారు. జీహెచ్ఎంసీ యూసీడీ విభాగం వెండర్స్ కార్డులు జారీ చేసినా, వారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ యూనియన్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కార్డులున్న వ్యాపారులను సైతం నెలసరి మామూళ్ల కోసం వేధిస్తున్నారని, డబ్బులు ఇవ్వని పక్షంలో అక్కడి నుంచి పంపించేస్తామని బెదిరిస్తుండటంతో చిరు వ్యాపారులు బేజారవుతున్నారు.
Also Read: Telangana Secretariat: సచివాలయం వద్ద ప్రమాదం.. గ్రిల్‌లో ఇరుక్కున ఉద్యోగిని కాలు
కేంద్ర మంత్రి అండతో
సచివాలయం ముందు కొత్తవారు వెండర్ కార్డుల కోసం ప్రయత్నిస్తే, ఆ సమాచారం వెంటనే యూనియన్ నేతలకు చేరిపోతుండటం గమనార్హం. వ్యాపారం చేయాలంటే తమ నేతను కలవాలంటూ ఒత్తిడి చేస్తున్న నేతలు, ఓ కేంద్ర మంత్రి అండ చూపిస్తూ చిరు వ్యాపారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. సదరు నేత నెలసరి మామూళ్లు వసూలు చేసి యూనియన్ నేతలకు వాటాలు పంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ సమస్యను పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వ్యాపారులకు, తిరిగి ‘యూనియన్‌నే సంప్రదించండి’ అని పోలీసులు సూచించడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక్కడ అర్ధరాత్రి వరకు మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని, మందుబాబుల వల్ల మహిళలకు రక్షణ కరువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కీలకమైన సచివాలయ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు భద్రతను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి.
Also Read: Ranga Reddy District: పక్కదారి పడుతున్న గోధుమలు.. సందట్లో సడేమియాలా డీలర్ల తీరు!

