Hyderabad News:
- న్యాయస్థానంలో మూడు కేసులు
త్వరగా పరిష్కరించేందుకు బల్దియా కసరత్తు
స్థల సేకరణకు సర్వం సిద్ధం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడంతో పాటు, సిటీలో సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులకు లీగల్ సమస్యలు ఎదురవుతున్నాయి. గత సర్కారు హయాంలో ఎస్ఆర్‌డీపీ పేరిట కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లై ఓవర్లు, మరో 7 అండర్ పాస్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే, ఈ పనులతో పార్కులోని పర్యావరణం, వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందంటూ కొందరు నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో, ఆదిలోనే పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆ అడ్డంకులు తొలగిపోవటంతో ఎస్ఆర్‌డీపీ పేరును హెచ్ సిటీగా మార్చివేసి, కేబీఆర్ పార్కు చుట్టూ 7 స్టీల్ ఫ్లై ఓవర్లు, 7 అండర్ పాస్‌ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టింది.
Read this- HYDRAA Plan: హైడ్రా మాన్సూన్ యాక్షన్ ప్లాన్
ఇందుకోసం ప్రభుత్వం రూ.825 కోట్లకు పరిపాలన మంజూరు చేయడంతో గతేడాది డిసెంబర్ 4న హెచ్ సిటీ పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయిననప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు. స్థల సేకరణకు కేబీఆర్ పార్కు చుట్టూ సుమారు 250 పైచిలుకు ప్రాపర్టీలకు మార్కింగ్‌లు కూడా చేశారు. కానీ, ఈ పనులపై నేటికి న్యాయస్థానాల్లో మూడు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకే, జీహెచ్ఎంసీ పనులు చేపట్టే సాహసం చేయడం లేదని తెలిసింది. ముఖ్యంగా ఈ పనులతో పార్కులోని పచ్చదనం దెబ్బతింటుందని, సుమారు 3 వేల చెట్లకు ముప్పు పొంచి ఉందంటూ ‘ఎకో సెన్సిటీవ్ జోన్’గా నిర్వహించాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. పార్కులోని వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందంటూ ముగ్గురు వ్యక్తులు కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ వివాదం కోర్టు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ మూడు కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టనున్న హెచ్ సిటీ పనులతో పచ్చదనానికి, వన్యప్రాణులకు గానీ ఎలాంటి ముప్పు వాటిల్లదని కోర్టుకు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్‌కు కూడా సర్కారు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Read this- Plane Crash: ‘11ఏ’ సీటు మిస్టరీ.. 27 ఏళ్లక్రితం ‘సేమ్ మిరాకిల్’
ముగిసిన టెండర్ల ప్రక్రియ, సర్కారుకు నివేదిక
కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యను కట్టడి చేసేందుకు రానున్న ఇరవై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్న 7 ఫ్లై ఓవర్లు, మరో 7 అండర్ పాస్‌లకు సంబంధించి జీహెచ్ఎంసీ కొన్ని నెలల క్రితమే గ్లోబల్ టెండర్ల ప్రక్రియను చేపట్టింది. టెక్నికల్ బిడ్లు, ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించింది. వాటిలో మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ, కేఎన్ఆర్ కంపెనీలు బిడ్లను సమర్పించినట్లు తెలిసింది. వీటిలో మేఘా కంపెనీ ఎల్1గా నిలవడంతో ఆ నివేదికను జీహెచ్ఎంసీ అధికారులు సర్కారుకు పంపినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వచ్చే లోగా కోర్టులో ఉన్న మూడు కేసులను పరిష్కరించుకునేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు కేబీఆర్ చుట్టూ స్థల సేకరణ కోసం ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేసిన ఆస్తుల నుంచి స్థలాలను సేకరించే ప్రక్రియను కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. స్థల సేకరణకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేనందున సర్కారు తుది నిర్ణయం, కేసులు పరిష్కారమయ్యే లోపు స్థల సేకరణను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.