Hyderabad Cyber Crime Police: సైబర్ క్రిమినల్స్ చేతుల్లో మోసపోయిన 54మంది బాధితులకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఊరట కల్పించారు. బాధితులు పోగొట్టుకున్న 3.27 కోట్ల రూపాయల నగదును వారికి వాపసు ఇప్పించారు. ఏయేటికాయేడు రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలు కొనసాగిస్తూ వందల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలిగా స్టాక్ ట్రేడింగ్, ఇన్వెస్ట్ మెంట్ పేర 32మందిని లూటీ చేశారు.
మేము చెప్పినట్టుగా పెట్టుబడులు పెట్టండి…రూపాయికి పది రూపాయలు లాభం సంపాదించండంటూ వాట్సాప్ ద్వారా టార్గెట్ గా చేసుకున్న వారిని ఉచ్ఛులోకి లాగి కోటీ 62 లక్షల రూపాయలను లూటీ చేశారు. ఫెడెక్స్ కొరియర్ పేర మరో 14మందిని బెదరగొట్టి కోటీ 57 లక్షల రూపాయలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. ఇక, క్యూఆర్ కోడ్ ఫ్రాడ్ మోసానికి పాల్పడి ఓ వ్యక్తి నుంచి 43వేల రూపాయలను స్వాహా చేశారు.
Also Read; Telangana Group 1: గ్రూప్ 1 నియామకాలకు వీడిన అడ్డంకి.. త్వరలో సర్టిఫికెట్స్ పరిశీలన!
మీ క్రెడిట్ కార్డు వివరాలను అప్ డేట్ చేయాల్సి ఉందంటూ మరో వ్యక్తిని ఉచ్ఛులోకి లాగి 89వేల రూపాయలను కొల్లగొట్టారు. నలుగురు బాధితులను కస్టమర్ కేర్ ఫ్రాడ్ మోసానికి గురి చేసి మరో 3.70లక్షల రూపాయలను లూటీ చేశారు. ఇద్దరు వ్యక్తులకు ఏపీకే ఫైళ్లను పంపించి వారి ఫోన్లను హ్యాక్ చేసి 3.39లక్షల రూపాయలను కొల్లగొట్టారు. ఈ మేరకు ఫిర్యాదులు అందగా కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆయా బ్యాంకుల నోడల్ అధికారులతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకుని సైబర్ క్రిమినల్ ఖాతాల్లో జమ అయిన డబ్బును ఫ్రీజ్ చేయించారు. అనంతరం 12వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ అనూష నుంచి అనుమతులు తీసుకుని మొత్తం 54మంది బాధితులకు శుక్రవారం 3.27 కోట్ల రూపాయలను తిరిగిచ్చారు.
మొదటి గంటలోనే…
సైబర్ క్రిమినల్స్ బారిన పడ్డవారు నేరం జరిగిన మొదటి గంటలోపే ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం డీసీపీ డీ.కవిత సూచించారు. అలా చేస్తే సైబర్ మోసగాళ్ల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును ఫ్రీజ్ చేయించే అవకాశం ఉంటుందన్నారు. గంట దాటితే తమ ఖాతాల్లో జమ అయిన డబ్బును ఇతర అకౌంట్లలోకి మార్చుకుని సైబర్ క్రిమినల్స్ స్వాహా చేస్తారని చెప్పారు. సీబీఐ, ఆర్బీఐ, ఈడీ, కస్టమ్స్, నార్కొటిక్ అధికారులమంటూ అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు భయపడవద్దని చెప్పారు.
ఏ ప్రభుత్వ అధికారి కూడా స్కైప్ యాప్ ద్వారా ఫోన్ కాల్స్ చేయరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కేసులు నమోదు చేయకుండా ఉండటానికి..కేసుల నుంచి తప్పించటానికి డబ్బులు డిమాండ్ చేయరని చెప్పారు. నిజానికి దేశంలో ఎక్కడా డిజిటల్ అరెస్ట్ విధానం అమల్లో లేదని తెలిపారు. ఇక, రూపాయికి పది రూపాయల లాభం సంపాదించండి అంటూ అపరిచితులు వాట్సాప్, టెలిగ్రాం, ఎక్స్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ ల ద్వారా పంపించే మెసెజీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు.
సెబీలో రిజిష్టర్ అయి ఉండే ఫైనాన్షియల్ అడ్వయిజర్ సలహాల మేరకే పెట్టుబడులు పెట్టాలన్నారు. పరిచయం లేని వారి నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ ను క్లిక్ చేయవద్దన్నారు. జాగ్రత్తగా ఉన్నా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పారు. వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు నగదు వాపసు అందటంలో కీలకపాత్ర పోషించిన అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు