Hanuman Shobha Yatra: ఈనెల 12న జరుగనున్న శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా శాంతిభద్రతల పరిస్థితికి ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు అలర్ట్ గా ఉండాలని హైదరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ సూచించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి బయల్దేరే చిన్న ఊరేగింపులు ప్రధాన ఊరేగింపులో కలిసే చోట ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. మతపరమైన ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని చెప్పారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర గౌలిగూడలోని రామ మందిరం నుంచి మొదలై తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు కొనసాగుతుందని చెబుతూ రూట్ మొత్తాన్ని ముందస్తుగా తనిఖీలు చేయాలన్నారు. ఎక్కడా అవాంతరాలు ఎదురు కాకుండా చూడాలని సూచించారు.
Also Read: SLBC Tunnel Update: 46వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు.. అగాధంలో ఆశ కోసం పోరాటం!
ఊరేగింపులో డీజేలు పెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాణాసంచా పేల్చనివ్వొద్దని తెలిపారు. దారిన వెళ్లే వారిపై రంగులు చల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యాత్రలో రెచ్చగొట్టేలా బ్యానర్లను ప్రదర్శించటాన్ని అడ్డుకోవాలన్నారు. ముందస్తు అనుమతి లేనిదే డ్రోన్లను వినియోగించనివ్వొద్దని చెప్పారు. ఇక, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరారు. యాత్ర సందర్భంగా పిక్ పాకెటింగులు, చెయిన్ స్నాచింగులు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, ఎస్బీ డీసీపీ చైతన్య కుమార్, ఐటీ సెల్ డీసీపీ పుష్ప, ఆయా జోన్ల డీసీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు