Palamuru University: పాలమూరు విశ్వవిద్యాలయ నాలుగో స్నాతకోత్సవాన్ని గురువారం నాడు యూనివర్సిటీ ఆడిటోరియంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రకటించిన గౌరవ డాక్టర్ రేట్ ను , యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ జి ఎన్ శ్రీనివాస్ తో కలిసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఎస్ఎన్ రెడ్డి కి అందజేశారు. అనంతరం గవర్నర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో సంపాదించిన జ్ఞానం, ధైర్యం, వినయం, అంకితభావంతో బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాలని సూచించారు. సమాజం పట్టభద్రులను గొప్ప అంచనాలతో చూస్తుందని, ఆ అంచనాల మేరకు గొప్పగా రాణించాలన్నారు.
యూనివర్సిటీలోకి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కాకుండా జ్ఞానాన్ని సంపాదించడం కోసం అడుగు పెట్టాలన్నారు. యూనివర్సిటీ కేవలం దశాబ్ద కాలంలో అద్భుతంగా ప్రగతి సాధించడం ప్రశంసనీయమన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం మరిన్ని నూతన ఆవిష్కరణలకు వేదిక కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. అనంతరం స్నాతకోత్సవ ఉపన్యాసం చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎం.ఎస్. ఎన్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీ మొట్టమొదటి గౌరవ డాక్టరేట్ ను తనకు ప్రధానం చేయడం, ఈ జిల్లా బిడ్డగా ఎంతో గర్వంగా ఉందన్నారు. విజయానికి దగ్గర దారులు ఉండవని, దానికి నిరంతరమైన కృషి ఒక్కటే మార్గమన్నారు. యువత తాను ఎంచుకున్న రంగంలో మొదట సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చని , అయినప్పటికీ అధైర్య పడకుండా ముందుకెళ్తే కచ్చితంగా విజయం సాధిస్తారన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం అభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఎప్పటికీ ఉంటుందన్నారు. తమ కంపెనీలలో మొదటి ప్రాధాన్యత జిల్లా యువతకే ఉంటుందన్నారు.
అనంతరం యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ జి ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్నాతకోత్సవం సందర్భంగా 12 మందికి పీహెచ్డీ అవార్డులు, 83 మందికి గోల్డ్ మెడల్స్ అందించినట్లు తెలిపారు. పాలమూరు మట్టిలో ప్రభవించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఎస్ఎన్ రెడ్డి కి గౌరవ డాక్టర్ రేట్ ను ప్రధానం చేయడం సంతోషంగా ఉందన్నారు. 171 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ పలు కోర్సులను అందజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , స్థానిక మంత్రులు ప్రతినిధుల సహకారంతో యూనివర్సిటీని మరింత పటిష్టంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, జిల్లా కలెక్టర్ విజయేందీరబోయి ,యూనివర్సిటీ రిజిస్టార్ రమేష్ బాబు, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, క్రీడల ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ఐ జి ఎల్ ఎస్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు
