తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : త్వరలో జరగనున్న గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశం కీలకంగా మారడంతో దానిపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి రేవంత్, పలువురు మంత్రులు ఆదివారం చర్చించారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించిన తేనీటి విందు (ఎట్ హోమ్) కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వీరంతా కొద్దిసేపు విడిగా భేటీ అయ్యారు. ఆ సమయంలో రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వే, ప్లానింగ్ డిపార్టుమెంటు డిజిటలైజేషన్, డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ త్వరలో నివేదికతో పాటు పలు సిఫారసులు చేయనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై గవర్నర్‌తో కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. రిజర్వేషన్ల అంశంలో అన్ని పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకోడానికి త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలనుకుంటున్న అభిప్రాయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిసింది.
ముగ్గురితో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిని కూడా గవర్నర్‌తో పంచుకున్నట్లు సమాచారం. వచ్చే నెల చివర్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నందున ఆ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చిన విషయాన్ని కూడా వివరించారు. ఈ పథకాల ద్వారా కలిగే లబ్ధిని, ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులను, లబ్ధిదారుల సంఖ్యను కూడా వివరించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను కూడా ఆయనకు చెప్పినట్లు సమాచారం.