Telangana Govt: ఎప్పుడెప్పుడా అంటూ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న సన్న రేషన్ బియ్యం పథకానికి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తామని పలుమార్లు ప్రభుత్వం ప్రకటనను విడుదల చేసింది. తాజాగా ఇదే విషయం పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నూతన రేషన్ కార్డులను అందజేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆయా జిల్లాల అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ఠ్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభించిందని చెప్పవచ్చు.
రేషన్ కార్డు లేని వారికి ఈ కార్యక్రమం గొప్పవరమని చెప్పవచ్చు. లక్షలాది మంది ప్రజలు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోగా, మరికొందరు నూతన రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే కార్డులకు సంబంధించిన డిజైన్ లను కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ధారించారు. క్యూ ఆర్ కోడ్ విధానంలో కార్డు తయారీ చేస్తుండగా, ఎక్కడైనా రేషన్ సరుకులు పొందే అవకాశం ప్రజలకు ఈ విధానం ద్వారా చేరువ కానుందని చెప్పవచ్చు.
ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రైతు విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు అధికంగా సన్న బియ్యాన్ని సాగు చేసిన యెడల, అదే ధాన్యాన్ని ప్రజలతో పాటు గురుకుల పాఠశాల విద్యార్థులకు సైతం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే గురుకుల పాఠశాల విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా అవుతుండగా రేషన్ కార్డుదారులకు అందించే సన్న బియ్యం పై అనుమానాలు వ్యక్త మయ్యాయి.
ఎట్టకేలకు రేషన్ కార్డుదారులందరికీ తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం అందించేందుకు ముందడుగు వేసింది. ఇదే విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది నుండి రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం అందించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర జనాభాలో 84 శాతం మందికి సన్న బియ్యం అందిస్తామని, 30వ తేదీన హుజుర్ నగర్ లో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.
Also Read: KA Paul: సచిన్, బాలకృష్ణ, ప్రభాస్ లకు వార్నింగ్.. 72 గంటలు టైమ్ ఇచ్చిన కేఏ పాల్..
సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బియ్యం పంపిణీపై అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉంటుందన్నారు. మొత్తం మీద తెలుగు కొత్త సంవత్సరాదిలో తెలంగాణ ప్రజలకు సన్న బియ్యం అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది.