Govt on Transgenders: మహానగరంలోని ట్రాన్స్ జెండర్‌లకు గౌరవ పదమైన భృతిని కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ట్రాఫిక్ నివారణలో వీరి సేవలను వినియోగిస్తున్నారు. తాజాగా వీరికి జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో నిర్వహణ పరంగా వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలని నిర్ణయం తీసుకున్నది. ట్రాన్స్ జెండర్లు భిక్షాటన చేయటం, డబ్బుల కోసం జనాలను వేధించటం వంటి వాటికి బ్రేక్ వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వారికి నగరంలోని ట్రాఫిక్ నిర్వహణలో ఉపాధి అవకాశాలు కల్పించారు. అదే విధంగానే జీహెచ్ఎంసీ కూడా పలు శాఖల నిర్వహణలో ట్రాన్స్ జెండర్లను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.
పలు విభాగాల నిర్వహణ వ్యయం రోజురోజుకి జీహెచ్ఎంసీకి భారంగా మారుతుండటంతో పాటు కాంట్రాక్టర్లకు అప్పగిస్తే బిల్లులు స్వీకరిస్తున్నారే తప్పా, నిర్వహణ పనులను జీహెచ్ఎంసీ ఆశించిన స్థాయిలో చేపట్టకపోవడంతో జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై ఇటీవల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పలు స్వచ్ఛంద సంస్థలు, ట్రాన్స్ జెండర్లు, కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్యంగా జీహెచ్ఎంసీకి చెందిన పార్కుల నిర్వహణతో పాటు సెక్యూరిటీ గార్డులుగా, అంతంతమాత్రంగా చదువుకున్న ట్రాన్స్ జెండర్లకు అవసరమైన చోట అటెండర్‌గా, ఇంకా బాగా చదివి కంప్యూటర్ బాగా వచ్చిన వారిని కంప్యూటర్ ఆపరేటర్లుగా అవకాశం కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. అవుట్ సోర్స్ ప్రాతిపదికన ఈ నియామకాలను జరిపి, ఆసక్తి కలిగిన ట్రాన్స్ జెండర్లకు నెలకు రూ.20 వేల నుంచి పోస్టును బట్టి రూ.25 వేల వరకు జీతాలుగా చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Also Read: Congress Leaders: కాంగ్రెస్‌లో రగడ.. రోడ్డెక్కిన నేతలు.. సవాళ్లు ప్రతి సవాళ్లు..
దీంతో పాటు ప్రతి అవుట్ సోర్స్ ఉద్యోగికి, ఈఎస్ఐ,పీఎఫ్ వంటి ప్రయోజనాలను కూడా కల్పించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఉద్యోగాలపై ఆసక్తి చూపని ట్రాన్స్ జెండర్ల ఆర్థిక ఎదుగుదల కోసం వారిని స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేసిన రుణాలు మంజూరు చేయాలని కూడా జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం.
ఇతర విభాగాల్లో నియామకాల కోసం శిక్షణ
జీహెచ్ఎంసీలోనే గాక, ఇతర విభాగాలు, పలు ప్రైవేట్ సంస్థల్లో కూడా వీరికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ ట్రాన్స్ జెండర్లకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. దీనికి తోడు ఇప్పటికే పలు పార్కుల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సైతం నిర్వహణలో తమ భాగస్వామ్యాన్ని పెంచాలని కోరినట్లు తెలిసింది. సెక్యూరిటీ గార్డ్స్, క్లీన్ డ్రైవ్ అమలులో గ్రీన్ మార్షల్స్, పార్కులు, జలమండలి, ఎస్‌బి రిజర్వాయర్ల వద్ద, స్పోర్ట్స్ గ్రౌండ్స్ వద్ద సెక్యూరిటీ గార్డ్‌లుగా, మెట్రో స్టేషన్‌లో ఉద్యోగ అవకాశాలు, అమృత్ స్కీం కింద నీటి నాణ్యత పరీక్షలో సహకారం, శిక్షణ అనంతరం స్ట్రీట్ లైట్ల నిర్వహణ, బస్తీ దవాఖానాలలో ప్యారా మెడికల్‌గా ఉపాధి కల్పించే అవకాశమున్నట్లు తెలిసింది.
తొలుత పది విభాగాల్లో వంద మంది
జీహెచ్ఎంసీలోని యూసీడీ విభాగం ఆధ్వర్యంలో ఆసక్తి కలిగిన ట్రాన్స్ జెండర్లను తొలి దశగా వంద మందిని దాదాపు 10 విభాగాల్లో అవుట్ సోర్స్ కార్మికులుగా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఆసక్తితో ముందుకు వచ్చే ట్రాన్స్ జెండర్లు వారి విద్యార్హతలతో పాటు వారికున్న పని నైపుణ్యతను బట్టి ఈ నియామకాలు చేపట్టినట్లు సమాచారం. ఈ మేరకు జీహెచ్ఎంసీ నేతృత్వంలో సిటీలోని జలమండలి, హైదరాబాద్ మెట్రో రైలు ఇతర విభాగాల్లో ఎక్కడెక్కడ ట్రాన్స్ జెండర్ల సేవలు అవసరమన్న విషయంపై జీహెచ్ఎంసీ వివరాలు సేకరిస్తున్నది.
Also Read: TG on Temple Lands: దేవాలయ భూములకు జీడీపీఎస్ సర్వే.. మూడు జిల్లాల ఎంపిక!