GHMC Regulations ( Image Source: Twitter)
తెలంగాణ

GHMC Regulations: పర్మిషన్స్ ఉన్నా ‘ఎన్ఓసీ’ తీసుకురావాల్సిందే.. జీహెచ్‌ఎంసీ కొత్త నిబంధనతో వణికిపోతున్న బిల్డర్లు

GHMC Regulations: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల తర్వాత, నిర్మాణం పూర్తయిన భవనాలకు జారీ చేసే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) కోసం రెవెన్యూ ఎన్ఓసీ, బఫర్ క్లియరెన్స్ సర్టిఫికెట్లను తప్పనిసరి చేస్తూ జీహెచ్‌ఎంసీలో విచిత్రమైన నిబంధన అమలవుతుంది. చెరువులకు సమీపంలో లేని భవనాలకు రెవెన్యూ ఎన్ఓసీ, సమీపంలో ఉన్న భవనాలకు బఫర్ క్లియరెన్స్ సర్టిఫికెట్లను కోరడంపై బిల్డర్లు, భవన యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతి జారీ చేసే సమయంలోనే నిర్మాణం చేపట్టనున్న స్థలానికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లతో పాటు లింకు డాక్యుమెంట్లను సైతం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తున్న జీహెచ్‌ఎంసీ, నిర్మాణం పూర్తయిన తర్వాత 10 శాతం లోపు డీవియేషన్లున్నా, ఓసీ జారీ కోసం తాజాగా ఈ అర్ధరహితమైన నిబంధనను తెరపైకి తేవడంతో నిర్మాణదారులు బెంబేలెత్తుతున్నారు.

నిర్మాణ అనుమతికి లోబడి 10 శాతం డీవియేషన్స్ కన్నా తక్కువ డీవియేషన్స్‌తో నిర్మాణం పూర్తయిన భవనాల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం బిల్డర్లు, గుత్తేదారులు ఇప్పుడు లేక్స్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ సరికొత్త నిబంధనతో భవన నిర్మాణ అనుమతుల కోసం ఇప్పటి వరకు కేవలం జీహెచ్‌ఎంసీ అధికారులకు మాత్రమే ‘అమ్యామ్యాలు’ సమర్పించుకునే పరిస్థితులుండగా, ఇప్పుడు చెరువులు, నాలాలకు సమీపంలో లేకపోయినా, రెవెన్యూ, లేక్స్, ఇరిగేషన్ విభాగాలతో సంబంధం లేకపోయినా, ఈ మూడు విభాగాలకు సైతం ‘అమ్యామ్యాలు’ చెల్లించాల్సిన దుస్థితి తలెత్తిందని బిల్డర్లు వాపోతున్నారు. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి వంటి ఐఏఎస్ ఆఫీసర్లు జోనల్ కమిషనర్లుగా ఉన్న ప్రాంతాల్లో కూడా చెరువులు, కుంటలు, నాలాలకు దగ్గరలో లేని భవనాల ఓసీల కోసం క్లియరెన్స్ సర్టిఫికెట్లు అడగడంతో బిల్డర్లు, ఆర్కిటెక్టులు తలలు పట్టుకుంటున్నారు.

బిల్డింగ్ నిర్మాణ అనుమతులు జారీ చేసే ముందు ఏ మాత్రం అనుమానం వచ్చినా, ఇరిగేషన్, రెవెన్యూ ఎన్ఓసీలను అభ్యర్థించి, అవి సమర్పించిన తర్వాతే నిర్మాణ అనుమతులు జారీ చేస్తుండగా, నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ ఓసీ ఇచ్చేందుకు ఇరిగేషన్, రెవెన్యూ ఎన్ఓసీల నిబంధన పెట్టడం ఎంత వరకు సబబు అంటూ బిల్డర్లు, భవన యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనను ఎత్తివేయాలని కోరుతూ త్వరలోనే కొందరు బిల్డర్లు ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి అయిన రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం కూడా లేకపోలేదు.

కుదరని జాయింట్ ఇన్‌స్పెక్షన్లు..

గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఐదు అంతస్తులు, అంతకన్నా ఎక్కువ అంతస్తులతో నిర్మితమవుతున్న భవనాలకు ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసి, ఉభయ విభాగాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే సర్టిఫికెట్ల జారీ చేస్తామని చెబుతున్నారు. అయితే, ఈ రెండు విభాగాలకు చెందిన అధికారులకు కలిసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసేందుకు సమయం కుదరక జాప్యం జరుగుతుందని మరికొందరు బిల్డర్లు, భవన యజమానులు వాపోతున్నారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత, ఆ ఎన్ఓసీ ఆధారంగా ఓసీలు మంజూరు చేయాలని, ఒకసారి ఎన్ఓసీ జారీ చేసిన తర్వాత మళ్లీ ఎందుకని కొందరు రెవెన్యూ, ఇరిగేషన్ విభాగ అధికారులు బిల్డర్లకు, భవన యజమానులకు సూచిస్తుండగా, ఇదే అదునుగా కొందరు ఇరిగేషన్ ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులు బేరం కుదుర్చుకుని ఎన్ఓసీలు జారీ చేస్తూ, ఈ నిబంధనను సొమ్ము చేసుకుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్