Beggar Free City: గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీ(Beggar Free City) చేసేందుకు జీహెచ్ఎంసీ(GHMC) మరో ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా ఈ దిశగా సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా కలెక్టరేట్, జీహెచ్ఎంసీ గతంలో పలుసార్లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో విరమించుకున్నారు. జీహెచ్ఎంసీకి సుమారు రెండు నెలల క్రితం కొత్త కమిషనర్ గా వచ్చిన ఆర్.వి. కర్ణన్(RV.Karnan) ప్రతి నెల ఓ స్పెషల్ యాక్షన్ చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించుకున్న షెడ్యూల్ లో భాగంగా మరోసారి సిటీని బెగ్గర్ ఫ్రీ సిటీ(Beggar Free City)) చేసే ప్రయత్నాన్ని ప్రారంభించారు.
ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్, కూడళ్లలో ఆగే వాహనదారులకు బెగ్గర్లతో పెద్ద ఇబ్బందులు తలెత్తుతున్నందున ఈ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ మరోసారి నడుం భిగించింది. ఇప్పటికే సిటీలో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న నైట్ షెల్డర్లలో వీరికి ఆశ్రయం కల్పించేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తుంది. మూడు రోజుల నుంచి తాజాగా మొదలుపెట్టిన ఈ ప్రయత్నంలో భాగంగా అన్ని సర్కిళ్లలో ప్రధానంగా, బషీర్ బాగ్, సెక్రెటరియేట్, నాంపల్లి, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో జంక్షన్ల వద్ద ఉండే యాచకులు, ఫుట్ పాత్ లపై ఉండే వారిని గుర్తించి జీహెచ్ఎంసీ నిర్వహించే షెల్టర్ హోమ్ లకు తరలిస్తున్నారు.
జీహెచ్ఎంసీ షెల్టర్ హోమ్స్‌కు తరలించే ఏర్పాటు
మిగిలిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని తమ స్వంత ఊర్లకు, నివాసాలకు పంపిస్తున్నారు. మరి కొందరి నుంచి తమ స్వస్థలాలు, కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి, వారి పిలిపించి మరీ వారికి అప్పగిస్తున్నారు. జీహెచ్ఎంసీ(GHMC) అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ప్రయత్నంలో భాగంగా ప్రధాన కూడళ్లు, మతపరమైన ప్రదేశాలలో భిక్షాటన చేసే వారి గురించి సమాచారం అందుకుని, వారిని, వైద్య పరీక్షల తర్వాత పోలీసుల సహకారంతో జీహెచ్ఎంసీ షెల్టర్ హోమ్స్‌కు తరలించే ఏర్పాటు చేస్తున్నారు.
యూసీడీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాచకుల తరలింపులో 221 మందిని గుర్తించారు. వీరిలో 173 మంది పురుషులు, 37 మంది స్త్రీలు, 11 పిల్లలున్నట్లు గుర్తించారు. వీరిలో 19 మందిని జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ కు తరలించగా, మిగిలిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు. యాచకులు, ఫుట్ పాత్(Foot Path) లపై ఉండేవారిని షెల్టర్ హోమ్ లకు లేదా వారి కుటుంబ సభ్యుల వద్దకు తరలించే ప్రక్రియ నిరం
తరం కొనసాగుతుందని, ఇందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ యూసీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ సిటీ(Operation City Police పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారుల జాయింట్ ఆపరేషన్ గా కొనసాగుతుంది.
Also Read: Minister Uttam Kumar Reddy: 30న ప్రజా భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్!
ఎన్నిరోజులు కొనసాగుతుందో?
గడిచిన మూడు దశాబ్దాలుగా సుమారు నాలుగు సర్కారు శాఖలు చేసిన ప్రయత్నాలు ఫలించక, వదిలేసిన ఈ ప్రయత్నాన్ని మళ్లీ జీహెచ్ఎంసీ మొదలుపెట్టింది. గతంలో కూడా ఇదే తరహాలో రైల్వే స్టేషన్లు(Railway Station), బస్ స్టేషన్లతో పాటు దేవాలయాలు, మతరపైన మందిరాల వద్దనున్న యాచకులను తీసుకువచ్చి, నైట్ షెల్టర్లలో ఉంచారు. వీరిలో ఎక్కువ మంది రోజుంత భిక్షాటన చేసి, అంతో ఇంతో కూడబెట్టుకున్న డబ్బుతో రాత్రిపూట మద్యం సేవించి మిగిలిన డబ్బుతో వచ్చే ఫుడ్ తినేసి, రోడ్డుకిరువైపులా పడుకునే వారు. ఇదే రకంగా తీసుకెళ్లి రెండు రోజులు షెల్టర్లలో పెట్తిన తర్వాత మత్తుకు బానిసలైన నిరాశ్రయులు, బెగ్గర్లు తమకు మద్యం కావాలని, సిగరెట్లు, బీడీలు కావాలంటూ అధికారులతో, షెల్టర్ల టేక్ కేర్లతో గొడవలు పెట్టుకుని, అధికారులపై దాడి చేసి మరీ షెల్టర్ల నుంచి పారిపోయిన సందర్భాలున్నాయి.
వారికి ఆశ్రయం, పునరావాసం కల్పించటంతో పాటు వారి అవసరాలు తీర్చే స్థాయిలో అధికారులు ప్రయత్నాలు చేస్తే తప్పా, వారు షెల్టర్లలో కొనసాగే పరిస్థితుల్లేవు. వీరిలో కొందర్ని ఇప్పటి మాదిరిగానే స్వస్థలాలకు పంపటంతో పాటు కుటుంబ సభ్యులకు అప్పగించిన కొద్దిరోజులకే మళ్లీ వారు నగరానికి వచ్చి భిక్షాటన చేయటం, పాత కాగితాలను ఏరుకుని, వాటిని విక్రయించుకుని రోడ్లకిరువైపులా గడిపారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ బెగ్గర్ల సమస్యను పరిష్కరించేందుకు చేస్తున్న మరో ప్రయత్నం ఎంత వరకు, ఎన్నిరోజుల పాటు కొనసాగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
Also Read: Maoists Party Letter: మంత్రి సీతక్కపై మావోయిస్టుల బహిరంగ లేఖ.. సూటిగా ప్రశ్నల వర్షం!