Ghanpur Project: ఘనపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నీరు వదిలితే సరే లేదంటే మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాల రైతులతో పెద్ద ఎత్తున మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరీ సుభాష్ రెడ్డి లు హెచ్చరించారు. సోమవారం ఉదయం మెదక్ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మీడియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి దయానీయంగా మారిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లా అంటారు కానీ, ఇక్కడి రైతుల పరిస్థితి పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శించారు. సింగూరులో నీళ్లు ఉన్నపటికీ ఘనపూర్ ప్రాజెక్ట్‌కు 0.4 టీఎంసీలు వాటాగా రావాల్సినవి విడుదల చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ హయంలో సమయానికి నీళ్లు విడుదల చేసిన విషయాన్ని గులాబీ నేతలు గుర్తు చేశారు. సింగూరు, కాళేశ్వరం జలాలు, కొండపోచమ్మ సాగర్ నుంచి హాల్దీ ప్రాజెక్టుకు సాగు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని పద్మా దేవేందర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సుభాష్ రెడ్డిలు డిమాండ్ చేశారు.
ప్రోటోకాల్ పాటించండి!
నర్సాపూర్ నియోజక వర్గంలో అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కాదని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం సబబు కాదని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, అధికారులు కూడా ప్రోటోకాల్ పాటించండం లేదని కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ ఇవ్వకుండా అధికార పార్టీ నేతలకు పోలీసులు ఎస్కార్ట్ ఇస్తున్నారని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్‌లు భట్టి జగపతి, మల్లికార్జున్ గౌడ్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలగౌడ్, నాయకులు మామిళ్ళ ఆంజనేయులు, లింగారెడ్డి, గంగా నరేందర్, జీవన్ రావు, మాజీ ఎంపీపీ కల్లూరు కృష్ణ, ప్రజాప్రతినిధులు, రాజా మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Read Also- Adulterated Toddy: ప్యాకెట్ కల్లు తాగి దంపతులకు అస్వస్థత
అసలేంటీ ప్రాజెక్ట్?
ఘనపూర్ ప్రాజెక్టు మెదక్ జిల్లాలో మంజీరా నదిపై నిర్మించబడింది. ఇది మెదక్, కొల్చారం, పాపన్నపేట మండలాలకు సాగునీరు అందిస్తుంది. ఘనపూర్ ప్రాజెక్టు ఆయకట్టు సుమారు 21,625 ఎకరాలుగా ఉంది. అయితే, సింగూరు ప్రాజెక్టులో నీటి లభ్యతను బట్టి, కాలువల ఆధునీకరణ పనులను బట్టి ఈ ఆయకట్టుకు నీటి విడుదల ఆధారపడి ఉంటుంది. ఘనపూర్ ఆనకట్టను నిజాం హయాంలో 1905లో నిర్మించారు. మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు ఇది. మొదట 5,000 ఎకరాలకు నీరందించే సామర్థ్యం ఉండేది. తర్వాత ఫత్తేనహర్ (ఎడమ కాలువ)ను చేర్చి దాని వినియోగాన్ని పెంచారు. ప్రాజెక్టు ఆయకట్టును పెంచడానికి, కాలువల ఆధునీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీని ద్వారా అదనంగా 8,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఘనపూర్ ప్రాజెక్టు ప్రధానంగా మంజీరా నది, సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని పొందుతుంది. సింగూరు ప్రాజెక్టు నీటిలో ఘనపూర్ ఆయకట్టు పంటల సాగు కోసం 4.6 టీఎంసీల వాటా ఉంది. కొన్నిసార్లు సింగూరు ప్రాజెక్టులో తగినంత నీరు లేకపోవడం వల్ల ఘనపూర్ ఆయకట్టు కింద ఉన్న పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. ఘనపూర్ ప్రాజెక్టు మెదక్ జిల్లా రైతులకు ఒక కీలకమైన నీటి వనరు.
Read Also- Bonalu festival: అమ్మవారిని దర్శించుకున్న ఐపీఎస్‌లు