Ganja Smuggling: గంజాయిపై ఈగల్ టీమ్ స్పెషల్ ఫోకస్
Ganja (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Ganja Smuggling: గంజాయి రవాణాపై స్పెషల్ ఫోకస్ చేసిన ఈగల్ టీమ్.. ఎందుకో తెలుసా?

Ganja Smuggling: కాపుకొచ్చిన గంజాయి పంట

ఒడిశా, విశాఖ ఏజన్సీల నుంచి భారీ మొత్తంలో స్మగ్లింగ్‌ కాలం ఇదే​
తెలంగాణ మీదుగా కర్ణాటక, మహారాష్ట్రలకు చేరుస్తున్న పెడ్లర్లు
ఫోకస్ పెట్టిన ఎక్సైజ్, ఈగల్, ఇతర దర్యాప్తు సంస్థలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మత్తులో ముంచి బతుకులను చిత్తు చేసే గంజాయి పంట కోతల సమయం (Ganja Smuggling) కావటంతో దర్యాప్తు సంస్థలు ఫోకస్​ పెంచాయి. ముఖ్యంగా ఒడిశా, విశాఖ ఏజన్సీ ప్రాంతం నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చేరుతున్న గంజాయి రవాణాను అరికట్టటానికి విస్తృతస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో అక్కడక్కడా సాగుతున్న గంజాయి సాగుపై కూడా నజర్​ పెట్టాయి.

ఇటు ఒడిశాలోని కోరాపుట్​, అటు విశాఖపట్టణం ఏజన్సీ ప్రాంతాల నుంచి ఏటా వందల కోట్ల రూపాయల గంజాయి దందా జరుగుతున్న విషయం తెలిసిందే. లక్ష పెట్టుబడిగా పెడితే అయిదు లక్షల రాబడి ఉండటంతో వందలాది మంది వేలాది ఎకరాల్లో గంజాయిని సాగు చేస్తున్నారు. ఎక్సైజ్ వర్గాలు చెప్పిన ప్రకారం నాలుగు నెలల్లో గంజాయి పంట కోతకు వస్తుంది. ఇక, ఈ పంట వేయటానికి అనుకూల సమయం జూలై, ఆగస్టు నెలలు. కోతలు జరిపేది నవంబర్, డిసెంబర్‌లలో. ఈసారి కూడా కోరాపుట్​, విశాఖ ఏజన్సీ ప్రాంతాల్లో వందలాది ఎకారల్లో సాగు చేసిన గంజాయి కోతలు జోరుగా జరుగుతున్నట్టు అధికారులకు సమాచారం ఉంది.

తెలంగాణ మీదుగా…

ఇలా పండిస్తున్న గంజాయిని స్మగ్లర్లు తెలంగాణ మీదుగా ముంబయి, గోవా, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాలకు ఎక్కువగా తరలిస్తున్నారు. రెండేసి కిలోల చొప్పున పొట్లాలు కట్టి కార్లు, డీసీఎం వ్యాన్లు, కూరగాయల ట్రక్కులు, లారీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్లలో వాటిని పెట్టి స్మగుల్ చేస్తున్నారు. వాసన రాకుండా ఉండటానికి గంజాయి ప్యాకెట్లపై సెంట్​ కొడుతున్నారు. రైలు, బస్సు మార్గాల్లో కూడా గంజాయి స్మగ్లింగ్​ సాగిస్తున్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ దందాలో వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు కీలక పాత్ర వహిస్తుండటం.

స్థానికంగా కూడా…

ఒడిశా, విశాఖ ఏజన్సీలతోపాటు మన రాష్ట్రంలో కూడా కొన్నిచోట్ల రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించటానికి గంజాయి సాగు చేస్తుండటం గమనార్హం. ముఖ్యంగా వికారాబాద్​, మెదక్​, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా గంజాయి సాగు జరుగుతున్నట్టు ఎక్సయిజ్​ వర్గాల ద్వారా తెలిసింది. గడిచిన నాలుగేళ్లలో ఎక్సయిజ్​ పోలీసులు ఆయా జిల్లాల్లో 21వేలకు పైగా గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఎక్సయిజ్ పోలీసులు తాండూరు మండలంలోని బర్వాద గ్రామంలో 108 గంజాయి మొక్కలను సీజ్ చేశారు. రైతులు ఎక్కువగా పత్తి, పసుపు, కంది చేన్లలో అంతర్ పంటగా దీనిని సాగు చేస్తుండటం గమనార్హం.

ఇంటి డాబాలపై సైతం…

గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే హైదరాబాద్ లో సైతం కొందరు ఇంటి డాబాలపై గంజాయి మొక్కలను పెంచుతుండటం. బీహార్​, ఒడిశా, రాజస్థాన్​ రాష్ట్రాల నుంచి ఉపాధిని వెతుక్కుంటూ వచ్చిన వారిలో కొందరు సొంతంగా వాడుకోవటంతోపాటు డబ్బు సంపాదించటానికి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ ఎక్సయిజ్​ ఎన్​ ఫోర్స్​ మెంట్ అధికారులు మలక్​ పేట గంజ్​ ప్రాంతంలో బీహార్​ కు చెందిన ఓ వ్యక్తి పెంచిన 10కిలోల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు వనస్థలిపురంలో ఉంటున్న ఓ వ్యక్తి తన ఇంటి బాల్కనీలో పెంచిన గంజాయి మొక్కలను అధికారులు సీజ్ చేశారు.

రకరకాలుగా…

ఇక, గంజాయి పెడ్లర్లు దానిని రకరకాల రూపాల్లో అమ్ముతున్నారు. పొడిగా చేసి సిగరెట్లలో నింపుతూ కొందరు విక్రయిస్తుండగా మరికొందరు గంజాయితో చాక్లెట్లు తయారు చేసి అమ్ముతున్నారు.ఇక, గంజాయి నుంచి హ్యాష్​ ఆయిల్​ తయారు చేసి మరికొందరు దందా సాగిస్తున్నారు.

ప్రత్యేక నిఘా…

ప్రస్తుతం కోతల సమయం కావటంతో గంజాయి స్మగ్లింగ్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఎక్సయిజ్​ ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టర్​ షానవాజ్​ ఖాసీం తెలిపారు. దీని కోసం రైళ్లు, బస్సుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దాంతోపాటు చెక్​ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను చెక్ చేస్తున్నట్టు తెలిపారు. అదే సమయంలో ఈగల్​ ఫోర్స్​, తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో, లా అండ్​ ఆర్డర్​, రైల్వే పోలీసులు సైతం గంజాయి రవాణాను నిరోధించటానికి విస్తృతస్థాయిలో చర్యలకు శ్రీకారం చుట్టారు.

Just In

01

Anil Ravipudi: ‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు.. అనిల్ రావిపూడి పోస్ట్ వైరల్!

Kiara Advani: ‘టాక్సిక్‌’లో కియారా అద్వానీ.. రాకింగ్ ఫస్ట్ లుక్ చూశారా!

Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే? తనూజ రాంగ్ డెసిషన్!

Congress Rebels: కాంగ్రెస్ రెబల్స్‌కు లబ్ డబ్.. క్షేత్రస్థాయిలో గందరగోళం!

Constable Incident: పోలీసుల ప్రాణాల మీదకు తెస్తున్న బెట్టింగ్ యాప్‌లు!