Ganja Racket: నిందితులకు రిమాండ్ విధింపు
నాగర్ కర్నూల్, స్వేచ్ఛ: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ కటకటాల పాలయింది. గత కొన్ని నెలలుగా జిల్లాలో, ప్రధానంగా జిల్లా కేంద్రమైన నాగర్ కర్నూల్ లో గంజాయి విక్రయించేవారు, గంజాయి సేవించేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలో పలు గొడవలు సైతం జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలకు కాలనీల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి. గంజాయి మత్తులో పోకిరీలుగా మారి గొడవలు చేస్తున్నారు. ఈ తరహా కొన్ని ఫిర్యాదులు, వివాదాలు పోలీస్ స్టేషన్లకు చేరాయి. దీంతో, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆదేశాలతో పోలీసులు గత కొంతకాలంగా గంజాయి బ్యాచ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Read Also- Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!
ఈ క్రమంలో ఆదివారం ఉయ్యాలవాడ రోడ్డులోని చైతన్య లాడ్జిలో గంజాయి అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు ఆదేశాలతో సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్‌లు లాడ్జిపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది యువకులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 735 గ్రాముల గంజాయి లభించింది. పోలీసుల విచారణలో హైదరాబాద్‌లోని దూల్‌పేటకు చెందిన ఆకాశ్ సింగ్ నుంచి ఈదమ్మ గుడి కాలనికి చెందిన బొందల రేణుకుమార్ (25), హౌసింగ్ బోర్డుకు చెందిన సందీప్ (22), రాఘవేంద్ర కాలనీకి చెందిన విశ్వాస్(25), అచంపేటకు చెందిన వంశీ(22) కిలో గంజాయి కొన్నారు.
Read Also- Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?
ఈ గంజాయిని చిన్న చిన్న పాకెట్లుగా చేసి అమ్ముతున్నారు. ఇలా లాడ్జిలో దాడులు చేసిన సమయంలో గంజాయి కొనేందుకు వచ్చిన పట్టణంలోని హరిజనవాడకు చెందిన కొత్త వెంకటేష్ (30), మనోజ్ కుమార్(20), తాడూరు మండలం గుంతకోడూరు గ్రామానికి చెందిన కృష్ణ గౌడ్(20), పరమేష్(20) పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, గంజాయి అమ్మిన ఆకాశ్ సింగ్‌ను త్వరలోనే పట్టుకుంటామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ 25 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, రిమాండ్‌కు తరలిస్తామన్నారు.
జిల్లా కేంద్రంతో పాటు బిజినపల్లి తదితర ప్రాంతాల్లో కూడా గంజాయి క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఎక్కడైనా ఇలా గంజాయికి సంబంధించిన వివరాలు ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.
