Gram Panchayat: గ్రామ పంచాయితీల్లోని సర్పంచ్ లు, వార్డు మెంబర్లకు నిధుల టెన్షన్ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి నిధులు వస్తాయా? లేదా? అనే అనుమానం మొదలైంది. ప్రభుత్వాల నుంచి నిధులు సకాలంలో అందకపోతే ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలనే ఆందోళన ఇప్పట్నుంచే ఆయా లీడర్లలో కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాలని చాలా మంది అభ్యర్ధులు ఊహించని స్థాయిలో హామీలు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా తాగునీరు, లైట్లు, రోడ్లు నిర్మాణాల వంటి హామీలే అత్యధికంగా ఉన్నాయి. ఇవి గ్రామాల అభివృద్ధిలో కీలకం. దీంతో ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోతే ఇచ్చిన హామీల అమలు కష్టతరంగా మారుతుందని పలువురు సర్పంచ్ లు టెన్షన్ పడుతున్నారు. ఈ దఫా భారీ స్థాయిలో నిధులు వస్తాయని ఎన్నికల కంటే ముందు గ్రామ పంచాయితీల్లో అన్ని పార్టీల పెద్ద లీడర్లు ప్రచారం చేశారు. దీంతో ఎక్కువ గ్రామ పంచాయితీల్లో అధికార పార్టీ మద్ధతుతోనే సర్పంచ్ లుగా ఎన్నిక కావడం గమనార్హం.
మార్చి వరకు నిధులు తెస్తానని సీఎం ఛాలెంజ్?
గ్రామ పంచాయితీలకు కేంద్రం నుంచి సుమారు మూడు వేల కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉన్నదని, వాటిని మార్చి చివరి నాటికి తీసుకువస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సర్పంచ్ లకు హామీ ఇచ్చారు. ఈ నిధులతో గ్రామాల్లోని మౌలిక వసతులు, సౌకర్యాలు, అభివృద్ధిలను సులువుగా పూర్తి చేసుకోవచ్చచన్నారు. ఈ నేపథ్యంలో ఆ నిధుల కోసం సర్పంచ్ లు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ నిధులు వచ్చే వరకు గ్రామాల్లో డెవలప్ మెంట్ ఎలా చేయాలనే దానిపై సర్పంచ్ లు తర్జన భర్జన పడుతున్నారు. ఈ మూడు నెలల పాటు గ్రామ పంచాయితీల్లో పాలన సాగించడం సర్పంచ్ లకు సవాల్ గా మారనున్నది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో మెజార్టీ సర్పంచ్ లు విచ్చలవిడిగా గ్రామాల్లో ఖర్చులు పెట్టారని, పంచాయితీ అకౌంట్లలో నిధులే లేవని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీంతో ఒక వైపు గ్రామ పాలన సాగించడం, మరోవైపు పంచాయితీ డెవలప్, హామీల అమలు అంశాలు సర్పంచ్ లను ఇరకాటంలో పడేస్తాయని విశ్లేషకులు వివరిస్తున్నారు.
Also Read: Panchayat Elections: నేడు మూడో విడత పోలింగ్.. అన్ని ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు!
భారీ ఖర్చులతో భయాందోళన
ఒక వైపు ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపై సర్పంచ్ ల్లో టెన్షన్ మొదలు కాగా, ఎన్నికల కోసం చేసిన వ్యక్తిగత ఖర్చులూ ఆయా అభ్యర్ధులకూ భయాందోళనను సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా సర్పంచ్ అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. మద్యం ప్రవాహం, ఓటుకు నోటు, భారీ ప్రచార హంగామాతో ఒక్కో పంచాయతీలో ఖర్చు అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఊహించని రీతిలో హామీలు ఇస్తూ, గెలుపు కోసం అప్పులు తెచ్చి మరీ కుమ్మరించారు. దీంతో ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలనే టెన్షన్ కూడా సర్పంచ్ ల్లో ఉన్నది. కొన్ని పంచాయితీల్లోని సర్పంచ్ లు మద్యం దుకాణాల్లోని బిల్లులను కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీరు అప్పులు చెల్లించడంలో ఒత్తిడికి గురవుతున్నారు.
నిధుల మళ్లింపు ఇక కష్టమే
గతంలో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లించే అవకాశం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలను కఠినతరం చేసింది.నిధుల వినియోగంలో పారదర్శకత కోసం కేంద్రం తెచ్చిన కొత్త ఆన్‌లైన్ పేమెంట్ వ్యవస్థ సర్పంచ్‌ల చేతులను కట్టేస్తోంది. అడ్డగోలుగా నిధులు డైవర్షన్ కు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. ఇక పాత నిధులకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించకపోతే కొత్త నిధులు విడుదల కావు. మరోవైపు పంచాయితీల్లో ఆదాయ వనరులు కూడా పెద్దగా లేనందున పన్నులు కూడా తక్కువగా ఉంటాయి. దీంతో ఇచ్చిన హామీలపై జనాలు నిలదీస్తారనే భయం కూడా కొన్ని పంచాయితీల్లోని సర్పంచ్ ల్లో నెలకొన్నది.

