motor-failures
తెలంగాణ

Nalgonda: మోటార్లు కాలిపోతున్నయ్.. చేన్లు ఎండిపోతున్నయ్

త్రీ ఫేజ్ సక్కగ ఇయ్యట్లే
2 ఫేజ్ కరెంట్ ఇయ్యడమే సమస్య
కాల్వలకు మోటార్లు పెడుతుండ్రు
అన్నదాతల అష్టకష్టాలు

నల్లగొండ బ్యూరో, స్వేచ్ఛ : కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన రాము(పేరు మార్చాం) వానాకాలం సీజన్‌లో మూడు ఎకరాల్లో వరి పొలం, మిగిలిన రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. యాసంగి సీజన్ ప్రారంభంలోనూ కాల్వ నీరు పుష్కలంగా రావడంతో పత్తి చేను పీకేసి వరి పొలం అదనంగా సాగు చేశాడు. గత 10 రోజుల క్రితం నుంచి కాల్వ నీరు తగ్గిపోయింది. వరి పొలమంతా పొట్టదశకు వచ్చింది. ఉన్న రెండు బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి నీరు సరిపోవడం లేదు. దీంతో కాల్వలో వచ్చే అరకొర నీటిని తోడేందుకు విద్యుత్ మోటారును కాల్వలో పెట్టి పొలానికి నీరు అందిస్తున్నాడు. అయితే ఇలాంటి అన్నదాతలు చాలామంది అదనంగా కాల్వల్లో విద్యుత్ మోటార్లను నడిపిస్తుండడంతో ఓవర్ లోడ్ సమస్య ఏర్పడి మాటిమాటికీ ట్రిప్ అవుతున్నది. దీనికితోడు త్రీ ఫేజ్ కరెంటుకు బదులుగా 2 ఫేజ్ కరెంటు వస్తుండడంతో మోటార్లు కాలిపోతున్నాయి. ఒక్క వారం రోజుల్లోనే రెండుసార్లు మోటార్లు కాలిపోయాయి. ఒక్క మోటారుకు రూ.3వేల చొప్పున మొత్తంగా రూ.6వేలు ఖర్చయ్యాయి.

త్రీ ఫేజ్ ఇయ్యకపోవడంతోనే..
పంట పొలాలు పొట్ట దశకు వచ్చాయి. మరో 20 రోజులు నీటి తడి అందితేనే అన్నదాతలు గట్టెక్కుతారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటడం.. కాల్వ నీరు చివరి పంట పొలాలకు అందకపోవడంతో పంట పొలాలు బీళ్లు బారాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు రోజురోజూకీ పెరిగిపోతున్నాయి. ఫలితంగా అన్నదాతలు పంట పొలాలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికితోడు విద్యుత్ సరఫరాలో ఓవర్ లోడ్ సమస్య.. త్రీ ఫేజ్ ఇయ్యకపోవడం.. 2 ఫేజ్ కరెంటుతోనే మోటార్లు నడిపిస్తుండడంతో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయి. వారం వ్యవధిలోనే రెండుమూడు సార్లు కాలిపోతుండడం అన్నదాతలకు తలకు మించిన భారంగా మారిపోతున్నది. పంట పండితే వచ్చే లాభం సంగతి పక్కన పెడితే.. మోటార్ల మరమ్మతులకే అప్పోసప్పో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాసంగి సీజన్ ప్రారంభంలో కాల్వ నీరు పుష్కలంగా రావడంతో ఉన్న వరి పొలాలకు తోడు కొత్తగా పత్తి, కంది వంటి ఇతర పంటలను చెడగొట్టి వరి సాగును అదనంగా చేపట్టారు. కానీ వరి పొలాలు పొట్టకు వచ్చే దశలో కాల్వల్లో సాగునీరు తగ్గడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. అయితే అన్నదాతలు వరి పొలాలను కాపాడుకునే ప్రయత్నంలో కాల్వలకు మోటార్లు పెట్టి అదనంగా నడిపించడం వల్లే విద్యుత్ ఓవర్ లోడ్‌కు కారణమవుతున్నది. ఈ క్రమంలోనే మోటార్లు మరమ్మతులకు గురవుతుండడం గమనార్హం.

పెరిగిన విద్యుత్ వినియోగం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 13 లక్షల ఎకరాల్లో యాసంగి సీజన్‌లో వరి పంటను సాగు చేశారు. ఇందులో అధిక శాతం బోరుబావుల కిందే సాగవుతున్నది. అయితే దాదాపు 60 శాతం వరి సాగుకు కాల్వల ద్వారా సాగునీరు అందే పరిస్థితి ఉన్నా.. బోరుబావులు అందుబాటులో ఉండడంతో కాల్వ నీటిని వానకాలం సీజన్‌లో పెద్దగా వినియోగించే పరిస్థితి ఉండదు. కానీ ఈ యాసంగి సీజన్‌లో ఉష్ణోగ్రతలు పెరగడం.. భూగర్భ జలాలు తగ్గడంతో కాల్వ నీటిపైనే ఎక్కువగా అన్నదాతలు ఆధారపడుతున్నారు. అయితే అన్నదాతలందరూ ఒకేసారి కాల్వ నీటిని వినియోగించుకుంటుండటం వల్ల చివరి పొలాలకు సాగు నీరు చేరే పరిస్థితి లేదు. దీంతో అన్నదాతలు కాల్వలకు మోటార్లు పెట్టి నీటిని పొలాలకు తరలిస్తున్నారు. అన్నదాతలు వినియోగించే మోటార్లలో 90 శాతం విద్యుత్ మోటార్లనే కాల్వ నీటిని తోడేందుకు వినియోగిస్తున్నారు. దీనికితోడు బోరు బావుల మోటార్లను సైతం సన్నధారగా వచ్చినా నడిపిస్తూనే ఉన్నారు. దీంతో ఉన్న మోటార్లకు తోడు కాల్వలకు అదనంగా మోటార్లు పెట్టడంతో విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. దీంతో ఓవర్ లోడ్ సమస్య.. త్రీ ఫేజ్ కరెంటు రాకపోవడం.. విద్యుత్ సరఫరాలో నిరంతరం విద్యుత్ అంతరాయం కలగడం.. తదితర సమస్యల నేపథ్యంలో విద్యుత్ మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. ఫలితంగా ఒక్కో విద్యుత్ మోటారుకు రూ.3వేల నుంచి రూ.3500 అన్నదాతలకు అదనపు భారంగా మారింది. ఇదిలావుంటే.. ఎండలు ముదురుతుండడంతో గృహాలు, వాణిజ్య ప్రాంతాల్లోనూ విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోతున్నది.

పంటలు కాపాడుకునేందుకు ఆరాటం
ఉమ్మడి జిల్లాలో వరి పంటపొలాలు కీలక పొట్టదశకు వచ్చాయి. మరో 20 రోజులు గట్టెక్కించగలిగితేనే రైతుల చేతికి ధాన్యం వచ్చే అవకాశం ఉంది. కానీ ఏమాత్రం నీరు అందకపోయినా.. ఇన్నాళ్లూ పడ్డ కష్టం వృథానే అని చెప్పాలి. నల్లగొండ జిల్లాలో 5.50 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 4.15 లక్షల ఎకరాలు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 2.98 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతున్నది. అయితే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట నియోజకవర్గాలకు సాగునీరు అందుతుంది. ఎస్సారెస్పీ జలాలు సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందుతుంది. అయితే ఈ కాల్వల్లో నీరు పుష్కలంగా రాకపోవడంతో విద్యుత్ మోటార్లకు అన్నదాతలు పని చెప్పారు. కొంతమంది అన్నదాతలు కొత్తగా మోటార్లు కొనుగోలు చేస్తే.. మరికొంతమంది అద్దెకు తెచ్చి పంట పొలాలను కాపాడుకునేందుకు ఆరాటపడుతుండడం గమనార్హం.

 

Just In

01

Mahabubabad District: నేడు సెలవు అయినా.. ఆగని యూరియా పంపిణీ.. ఎక్కడంటే..?

Chikoti Praveen: హైదరాబాద్ మరో పంజాబ్ గా మారే ప్రమాదం.. చికోటి ప్రవీణ్ సంచలన వాక్యలు

Samantha: వామ్మో.. 500 మంది మగాళ్ల ముందు హాట్ సీన్ లో రెచ్చిపోయిన సమంత..?

Cheruku Sudhakar: తెలంగాణ ఉద్యమంలో యువతకు ఆయనే ఆదర్శం.. మాజీ ఎమ్మెల్యే కీలక వాక్యలు

CP Anandh: నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది: సీపీ ఆనంద్