Fake Journalists: ఎన్నికల వేళ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులమని చెప్పి దందా నిర్వహిస్తున్న నకిలీ అధికారుల గుట్టు పాలకుర్తి పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు వ్యక్తులు కలిసి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో, పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… ములుగు ప్రాంతానికి చెందిన ధరావత్ ఆనంద్, పెద్ద వంగరలోని బంధువుల ఇంటికి వెళ్తూ తొర్రూరు పట్టణంలోని పాల కేంద్రం సమీపంలో ఉన్న వైన్స్ షాప్‌లో మద్యం కొనుగోలు చేసి కారులో బయలుదేరారు.
మద్యం తీసుకెళ్తున్నందుకు కేసు పెడతాం
వెంటనే సైరన్ పెట్టిన కారు వెనకాల నుంచి వచ్చి అతడిని అడ్డగించింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు “మేమే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మద్యం తీసుకెళ్తున్నందుకు కేసు పెడతాం… లక్ష రూపాయలు ఇవ్వకపోతే వదలం” అంటూ బెదిరించారని బాధితుడు ఆనంద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. భయపడిన ఆనంద్, తన బావమరిది ద్వారా వెంటనే రూ.1,00,000 సమకూర్చి వారికి అందించాడు. అనంతరం నకిలీ అధికారులు ఆనంద్ కారును, డ్రైవర్‌ను విడిచిపెట్టారు.
Also Read: Fake ST Certificates: ఓ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నకిలీ ఎస్టీ కుల పత్రాలతో నామినేషన్ కలకలం
ప్రధాన నిందితుడు అరెస్ట్
బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులు ఉపయోగించిన కారును బట్టి ప్రధాన నిందితుడైన జాటోత్ ఉపేందర్ సింగ్‌ను గుర్తించి నిన్న రాత్రి అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులో రూ.50,000, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉపేందర్ సింగ్ ‘సిగ్నేచర్ డిజిటల్ స్టూడియో’లో యాంకర్‌గా పనిచేస్తూ, జర్నలిస్టునని చెప్పుకుంటూ తిరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉపేందర్ ఇచ్చిన వివరాల మేరకు మరో ఇద్దరు నిందితుల వివరాలు బయటపడ్డాయి. వారు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నట్లు తెలిపారు. ఇద్దరిలో ఒకరు ప్రముఖ పత్రికకు తొర్రూరు విలేఖరి అని, మరొకరు ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్‌గా ఉన్నట్లు సమాచారం. వారిద్దరి అరెస్ట్‌కు గాలింపు చేపట్టామని, త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై జి. ఉపేందర్ తెలిపారు.
Also Read: Fake ST Certificates: ఓ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నకిలీ ఎస్టీ కుల పత్రాలతో నామినేషన్ కలకలం

