Fake Eye Doctors: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం శనివారం చేపట్టిన తనిఖీల్లో ఫేక్ కంటి డాక్టర్ల తో పాటు అర్హతకు మించి వైద్యం అందిస్తున్న ఆప్టోమెట్రీ(Optometry), ఆఫ్తాల్మా లజీ(Ophthalmology) టెక్నీషియన్ లతో పాటు ఆర్ఎంపీల గుట్టు రట్టయింది. ఫేక్ డాక్టర్లకు నోటీసులు ఇవ్వగా అర్హతకు మించి వైద్యం అందిస్తూ ప్రజలను చీట్ చేస్తున్న టెక్నీషియన్, ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులను నమోదు చేయనున్నట్లు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి నరేష్ కుమార్(Naresh Kumar) తెలిపారు. టీజీఎంసీ చైర్మన్ కె. మహేష్ కుమార్, రిజిస్టార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు మిషన్ మిర్యాలగూడ ఎగైనెస్ట్ క్వాకరీ సభ్యులు డాక్టర్ రవికుమార్, జె శ్రీకాంత్, విజిలెన్స్ అధికారి ఎం రాకేష్ ల బృందంతో డీఎస్పీ రాజశేఖర్ రాజు, ఇతర పోలీసు అధికారులతో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని ఐ హాస్పిటల్స్, ఆర్ఎంపీ క్లినిక్లపై దాడులు చేసినట్లు చెప్పారు.
డాక్టర్ల పేరుతో పర్మిషన్స్.. టెక్నీషియన్లతో వైద్యం
మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర, శ్రీ మహాలక్ష్మి, అన్నపూర్ణ, యశస్వి, షాలిని, రఫా విజన్ కేర్, శివ సాయి కంటి ఆస్పత్రుల్లో అర్హత కలిగిన వైద్య నిపుణులు లేరని మెడికల్ కౌన్సిల్ తనిఖీల బృందం తెలిపింది. పై ఆస్పత్రులన్నీ డిస్టిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ(డీఆర్ ఏ)లో నిపుణులైన డాక్టర్ల పేరిట పర్మిషన్లు తీసుకొని ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మాలజీ టెక్నీషియన్ లతో పరీక్షలు సూచించడంతో పాటు ఆపరేషన్లను చేయిస్తున్నాయి. లోకల్ గా పర్మిషన్లు పొందిన వైద్యులు హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించినట్లు మెడికల్ కౌన్సిల్ అధికారులు చెప్పారు.
Also Read: GHMC: వ్యాపారస్తులకు జీహెచ్ఎంసీ అలర్ట్.. ఫ్రీ రెన్యూవల్ డెడ్‌లైన్ నేటితో క్లోజ్!
మెడికల్ ఎథిక్స్ కమిటీ ముందు విచారణ
పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర, షాలిని కంటి వైద్యశాల డాక్టర్లు భరత్ భూషణ్, కె. వెంకటేశ్వర్లు. ఎంబీబీఎస్ మాత్రమే చదివి కంటి వైద్య నిపుణులుగా ప్రచారం చేస్తున్న తీరుతోపాటు టెక్నీషియన్లతోనే ఆస్పత్రులు నిర్వహిస్తున్న విధానంపై ఈ డాక్టర్లకు షోకాజ్ నోటీసి ఇచ్చి మెడికల్ ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీసెస్ కమిటీ ముందు విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. వీరితో పాటు డాక్టర్ శ్రీ కుమార్, ప్రభుచైతన్య, అమర్లకు నోటీసులు ఇచ్చినట్లు అవసరమైతే ఎంబీబీ ఎస్ ఎస్ డిగ్రీ, లైసెన్స్ లను సస్పెండ్ చేస్తామని ఈ తరహా వైద్య లోపాలపై కలెక్టర్ కు సిఫారస్ చేయనున్నట్లు టీజీఎంసి పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి నరేష్ కుమార్ చెప్పారు.
ఎన్ ఎంసీ, టీఎంపీ ఆర్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు
కంటి ఆస్పత్రుల్లో అర్హతకు మించి వైద్యం అందిస్తున్న టెక్నీషియన్లు నగేష్, వాల్కే శ్రీను, నాగరాజు, శివ కోటేశ్వరరావు, వెంకటేష్, వికాస్ కుమార్, తన క్లినిక్ లో బెడ్స్ ఏర్పాటు చేసి యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు ఇస్తున్న కోమల్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నకిలీ వైద్యుడు ఎ. కోటేశ్వరరావు పై ఎన్ ఎంసీ, టీఎంపీ ఆర్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. తనిఖీలపై తెలిసిన ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నకిలీ వైద్యుడు మునీర్ పరారైనట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
జనరల్, వీకెండ్ డాక్టర్ల ఆస్పత్రులపై ఫోకస్
కాగా క్వాలిఫికేషన్ లేకుండానే కంటి ఆస్పత్రులను రన్ చేస్తూ అమాయక ప్రజలకు ఐ ఆపరేషన్లు, ఇతర వైద్యం అందిస్తూ మెడికల్ మాఫియా సాగిస్తున్న బాగోతం వెలుగు చూసింది. అదేవిధంగా మిర్యాలగూడలో కంటి ఆస్పత్రుల నిర్వహణకు పర్మిషన్లు కలిగిన డాక్టర్లు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ప్రాక్టీస్ నడిపిస్తూ పట్టణంలో టెక్నీషియన్లతో ఫేక్ వైద్యం అందిస్తూ జనం సొమ్మును అడ్డంగా దోచేయటం.. తమకు అర్హత లేదని తెలిసిన ఓ ఇద్దరు డాక్టర్లతో పాటు టెక్నీషియన్ల తీరుతో మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధికి చెందిన ప్రజలు తమకు అందుతున్న అందుతున్న కంటి వైద్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంటి ఆస్పత్రులతో పాటు జనరల్, వీకెండ్ డాక్టర్లతో నడిచే హాస్పిటల్స్ పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.
Also Read: Jagan Birthday Cutout: వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం ముందు కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు

