Maoist Letter: ఇటీవలే బహిష్కరణకు గురైన మల్లోజుల వేణుగోపాల్ రావు(Venugopal Rao) మావోయిస్టు పార్టీని ఉద్దేశిస్తూ ఘాటైన లేఖ రాశారు. పార్టీ చేసిన తప్పులే శత్రువుకు ఆయుధాలుగా మారాయని అందులో పేర్కొన్నారు. ఈ తప్పులను అవకాశంగా చేసుకునే శత్రువు దండకారణ్యాన్ని మినహాయించి మిగితా ప్రాంతాల్లో ఉద్యమాన్ని దెబ్బ కొట్టాడని వ్యాఖ్యానించారు. బలహీనతలు చాలా కాలం క్రితమే తెలిసినా వాటి నుంచి బయట పడలేకపోయామన్నారు. చైనా.. రష్యా పంథా అనే పిడివాదానికి స్వస్తి చెప్పాలన్నారు. తాత్కాలికంగా చేస్తున్న సాయుధ పోరాట విరమణను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
20నెలలుగా..
ఇరవై నెలలుగా దోపిడీ పాలక వర్గాలు చుట్టుముట్టి మట్టుబెట్టే దాడులను అంతరం కలిసి ఎదుర్కొన్నామన్నారు. ఈ క్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరా(Basavaraju)జుతోపాటు వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలను అర్పించారన్నారు. విప్లవోద్యమం కోసం ప్రాణాలను తృణప్రాయంలా త్యజించిన అమర వీరులందరికీ పేరు పేరునా విప్లవ జోహార్లు అని పేర్కొన్నారు. వారి ఆశయాలను సాధించటానికి భవిష్యత్తులోనైనా సరైన మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించారు. యాభై ఏళ్ల పోరాటంలో పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని అంటూ చేసిన.. చేస్తున్న తప్పులు అంతకన్నా తీవ్రంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని ఏ ప్రాంతంలో కూడా నిలకడైన బలమైన సంఘటిత విప్లవోద్యమాన్ని నిర్మించ లేకపోయామని అభిప్రాయపడ్డారు. ఇది అందరూ జీర్ణించుకోవాల్సిన చేదు నిజమన్నారు.
Also Read: RTC Fare Hike: ఆర్టీసీ ఛార్జీలపెంపుదలను వెంటనే విరమించుకోవాలి.. సీపీఎం నేత డిమాండ్
తాత్కాలిక సాయుధ పోరాట విరమణ
మారుతున్న పరిస్థితులను అవగతం చేసుకుంటూ దెబ్బ తిన్న ప్రాంతాల్లో విప్లవోద్యమాన్ని పునర్నించటంలో పార్టీ విఫలమైందన్నారు. ప్రజల నుంచి పార్టీకి సానుభూతి ఉన్నా ఒంటరిగానే మిగిలిపోతున్నామని పేర్కొన్నారు. శత్రువు గొప్పతనంకన్నా మన బలహీనతలు, తప్పులే పార్టీని ప్రధానంగా దెబ్బ తీశాయన్నారు. విప్లవోద్యమాన్ని తిరిగి నిర్మించటానికి తాత్కాలిక సాయుధ పోరాట విరమణ తప్పనిసరని వ్యాఖ్యానించారు. చైనా.. రష్యా పంథా అనే పిడివాద ఆచరణకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చేసిందన్నారు. మన దేశ స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా విప్లవాన్ని జయప్రదం చేయటమే ప్రస్తుతం ముందున్న కర్తవ్యమన్నారు. దీని కోసమే తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన అని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకోని పక్షంలో రక్తమోడుతున్న అడవులను శాంతివనాలుగా మార్చలేమని అభిప్రాయ పడ్డారు. మిగిలిన విప్లవకారులను కాపాడుకోలేమని పేర్కొన్నారు. జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ ప్రజలను క్షమాపణలు కోరారు.
Also Read: Hyderabad: ఓరి దేవుడా.. పెద్ద ప్రమాదమే తప్పింది.. లేదంటే మెుత్తం పోయేవారే!
