Enc MuralidharRao
తెలంగాణ

Kaleshwaram Commission: తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా ! తెలివిగా సమాధానాలిచ్చిన ఈఎన్సీ

కాళేశ్వరం కమిషన్‌ ఎదుట రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్
అనేక ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా దాటవేత
జ్ఞాపకశక్తి మందగిస్తే రిటైర్‌మెంట్ తేదీ ఎలా గుర్తుంది?
తీవ్రస్థాయిలో జస్టిస్ పీసీ ఘోష్ అసహనం
కేసీఆర్, హరీశ్‌రావు ఆదేశాలతోనే పనులన్నీ!
హాజరైన నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, నరేందర్‌రెడ్డి
నలుగురికీ కలిపి ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్
‘కాగ్’ నుంచి హాజరైన ముగ్గురు ఆడిటర్లు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ‘నాకు జ్ఞాపకశక్తి మందగించింది.. గతంలో జరిగిన విషయాలు గుర్తుకు రావడంలేదు.. అన్నీ మర్చిపోయాను.’ ఇవీ రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్‌‌లో ఇచ్చిన సమాధానాలు. ‘కనీసం పదవీ విరమణ పొందిన తేదీ గుర్తుందా?’ అంటూ కమిషన్ హెడ్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించగా.. 2024 ఫిబ్రవరి అని మురళీధర్ బదులిచ్చారు. ఇది గుర్తుకున్నప్పుడు మిగిలిన విషయాలను ఎలా మర్చిపోయారని పీసీ ఘోష్ నిలదీశారు. అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోవడంతో కొన్ని డాక్యుమెంట్లను చూపించి ప్రశ్నల వర్షం కురిపించారు. మురళీధర్‌తోపాటు వివిధ స్థాయిల్లో పనిచేసిన రిటైర్డ్ ఇంజినీర్లు నల్లా వెంకటేశ్వర్లు, నాగేందర్‌రెడ్డి, హరిరామ్ తదితరులను జస్టిస్ ఘోష్ గురువారం క్రాస్ ఎగ్జామిన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ రిపోర్టు తయారుచేసిన కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తరఫున ముగ్గురు అధికారులను కూడా కలిపి విచారించిన జస్టిస్ ఘోష్.. ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల కాపీలను అందజేయాలని ఆదేశించారు.

పుస్తకాలు చదివితే మెమొరీ లాస్ కాదు : జడ్జి
మెమొరీలాస్ అయిందని మాజీ ఈఎన్సీ మురళీధర్ ఇచ్చిన సమాధానానికి జస్టిస్ ఘోష్ స్పందిస్తూ.. పుస్తకాలను చదివితే జ్ఞాపకశక్తి తిరిగి పుంజుకుంటుందని.. ఎక్కువగా చదవాలని సూచించారు. కాగా ప్రతిరోజూ తాను దినపత్రికలను చదువుతానని, పుస్తకాలను చదవలేనని మురళీధర్ రిప్లై ఇచ్చారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండి తప్పించుకోలేరని జడ్జి చురకలు వేస్తూనే.. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ అరెస్టు చేయడంలేదని.. బాధ్యత కలిగిన పోస్టులో ఉండి భారీ స్థాయి ప్రజాధనాన్ని వెచ్చించి కట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలియజేయాలనే కోరుతున్నామన్నారు. హైకోర్టు జడ్జిగా, చీఫ్ జస్టిస్‌గా, సుప్రీంకోర్టు జడ్జిగా తాను ఇచ్చిన తీర్పులు ఇప్పటికీ తనకు గుర్తు ఉన్నాయని, ఈఎన్సీ స్థాయిలో పనిచేసిన నాలుగైదేండ్లకే అన్ని విషయాలు మరిచిపోయారా? అంటూ జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు.

రాజ్యాంగం తెలియదా?
‘ఎవరి ఆదేశాల మేరకు కాళేశ్వరం పనులను అమలు చేశారు?’ అన్న కమిషన్ ప్రశ్నకు.. ప్రభుత్వం ఆదేశాల మేరకేనని మురళీధర్‌రావు సమాధానం చెప్పారు. ‘ప్రభుత్వం అంటే మీ దృష్టిలో ఎవరు?’ అని ప్రశ్నించగా.. చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అని బదులిచ్చారు. ప్రభుత్వమంటే అధికారులేనా?.. రాజ్యాంగం తెలియదా? పరిజ్ఞానం లేదా?ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేశారు గదా.. ప్రభుత్వంలోని పెద్దలెవరో అవగాహన లేదా? ఉద్దేశపూర్వకంగానే డొంకతిరుగుడు సమాధానం చెప్తున్నారా? అంటూ జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో పెద్దలంటే సీఎం, మంత్రులని మురళీధర్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నీ అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకే జరిగాయన్నారు. ఎవరి ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారీ బాధ్యతలను వ్యాప్కోస్ సంస్థకు అప్పగించారని ప్రశ్నించగా.. అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు.. అంటూ మురళీధర్ రిప్లై ఇచ్చారు.

అధికారుల దాటవేత ధోరణి
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక ప్రశ్నలకు అధికారులు సూటిగా సమాధానం చెప్పకపోగా దాటవేసే తీరులో వ్యవహరించడంపై జస్టిస్ ఘోష్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత తప్పుడు సమాధానాలు ఇవ్వకూడదని, ఆ ప్రమాణానికి న్యాయం చేయాలని, నిజాలను చెరిపే ప్రయత్నం చేయొద్దని నలుగురినీ సున్నితంగా హెచ్చరించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లనూ దాచిపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో ప్రశ్నకు నలుగురి నుంచీ సమాధానాలను రాబట్టేలా కమిషన్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రాజెక్టు డిజైన్లు, డీపీఆర్, నిర్మాణ సంస్థలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాలపై ప్రశ్నలు సంధించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? బ్యారేజీలలో నీళ్లను నింపాల్సిందిగా ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయని నిలదీశారు. ఆదేశాలన్నీ వారిద్దరి నుంచే వచ్చాయని, అందుకే బ్యారేజీలలో నీటిని నిల్వ చేయాల్సి వచ్చిందని అధికారులు బదులిచ్చారు.

గ్రావిటీ, విద్యుత్ ఖర్చు తగ్గించేందుకే లొకేషన్ మార్పు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్‌లను మార్చడంపై జస్టిస్ ఘోష్ నలుగురు అధికారులను ప్రశ్నించారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందని, నిర్ణయం ఎవరిదని నిలదీశారు. రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. గ్రావిటీ కెనాల్ పొడవును తగ్గించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, అటవీ భూముల సేకరణను తగ్గించడం, వాటర్ లిఫ్టింగ్ కోసం అయ్యే విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారాన్ని తగ్గించడం.. ఇలాంటి అవసరాల కోసమే బ్యారేజీల నిర్మాణ స్థలాలను మార్చినట్లు వివరించారు. ‘బ్యారేజీ పనుల ఆలస్యం అవుతున్నందుకు నిర్మాణ సంస్థలకు జరిమానాలు విధించారా?’ అని ప్రశ్నించగా.. అలాంటి పని ఎప్పుడూ చేయలేదని రిప్లై ఇచ్చారు. బ్యారేజ్‌ల నిర్మాణం పనులు జరిగేటప్పుడు తనవంతు బాధ్యతగా పర్యవేక్షణ అంశంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, తరచూ వెళ్లి చూశానని స్పష్టం చేశారు.

కేసీఆర్, హరీశ్ నుంచే ఆదేశాలు
డీపీఆర్ తయారీలో వ్యాప్కో సంస్థకు పనులు అలాట్ చేసే ఆదేశాలు కూడా కేసీఆర్, హరీశ్‌రావుల నుంచే వచ్చాయని అధికారులు కమిషన్‌కు వివరించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండిపోవడంతో అప్పటి ఉత్తర్వులు, కరస్పాండెన్స్ ప్రతులు, డాక్యుమెంట్లను ప్రదర్శించి వారి నుంచి జస్టిస్ ఘోష్ సమాధానాలు రాబట్టారు. ఆ డాక్యుమెంట్లపై ఈ నలుగురి సంతకాలు ఉండడంతో పెదవి విప్పాల్సి వచ్చింది. మూడు బ్యారేజీల అంచనా వ్యయం, బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల, కాంట్రాక్టు సంస్థలకు చేసిన చెల్లింపులు తదితర అంశాలపై అధికారులు తలో రకంగా సమాధానం చెప్పారు. మూడూ కలిపి రూ. 9 వేల కోట్లు అని ఓ అధికారి రిప్లై ఇవ్వగా.. ఒక డాక్యుమెంటులో రూ. 13 వేల కోట్లు అని పేర్కొని సంతకం ఎలా చేశారని జస్టిస్ ఘోష్ నిలదీశారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 28 గురించి కమిషన్ ప్రస్తావించగా నలుగురు అధికారులు మౌనంగా ఉండిపోయారు.

నేడు కమిషన్ చేతికి కాగ్ డాక్యుమెంట్లు 
కాళేశ్వరం ప్రాజెక్టుపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఆడిట్ రిపోర్టు సమర్పించిన ‘కాగ్’ సంస్థకు చెందిన ముగ్గురు ఆడిటర్లు కూడా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యారు. ఆడిట్ రిపోర్టులో ప్రస్తావించిన ఫైండింగ్స్ వివరాలను అంశాలవారీగా ప్రశ్నించారు. ముగ్గురినీ కలిపి ఎంక్వయిరీ చేసిన జస్టిస్ ఘోష్.. స్టడీ చేస్తున్న సమయంలో కాగ్ లేవనెత్తిన సందేహాలకు ప్రభుత్వం ఇచ్చిన వివరణలు, సమాధానాల కాపీలను అందజేయాలని కోరారు. ఈ అన్ని కాపీలను శుక్రవారం సమర్పిస్తామని జస్టిస్ ఘోష్‌కు తెలిపారు.

Just In

01

Pookalam Controversy: పూలరంగవల్లిలో ఆపరేషన్ సిందూర్‌పై వివాదం.. 27 మందిపై కేసు

Mahabubabad District: నేడు సెలవు అయినా.. ఆగని యూరియా పంపిణీ.. ఎక్కడంటే..?

Chikoti Praveen: హైదరాబాద్ మరో పంజాబ్ గా మారే ప్రమాదం.. చికోటి ప్రవీణ్ సంచలన వాక్యలు

Samantha: వామ్మో.. 500 మంది మగాళ్ల ముందు హాట్ సీన్ లో రెచ్చిపోయిన సమంత..?

Cheruku Sudhakar: తెలంగాణ ఉద్యమంలో యువతకు ఆయనే ఆదర్శం.. మాజీ ఎమ్మెల్యే కీలక వాక్యలు