Etela Rajender: ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల (Teacher MLC) బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డిని (Puli Sarvottam Reddy) మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ (Congress) పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో టీచర్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్న ఈటల… ప్రభుత్వ ఉపాధ్యాయులకు (Teachers) డీఏలు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు కేంద్రం అవకాశం కల్పించినప్పటికీ అప్పట్లో కేసీఆర్ కేంద్రానికి దరఖాస్తు పెట్టుకోకుండా సీపీఎస్ విధానాన్నే కోనసాగించారన్నారు. ఇక, తాను అధికారంలోకి వస్తే 317 జీవోను సవరిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా అదే దారిలో నడుస్తున్నారని మండిపడ్డారు. టీచర్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయిందని దుయ్యబట్టారు.
ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నా ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ఈటల ప్రశ్నించారు. రిటైర్ఢ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ అరాచకాలను ప్రశ్నించలన్నా, టీచర్ల సమస్యలు పరిష్కారం కావాలన్న బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 317 జీవో కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ అని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు, 66 మోసాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఈటల విమర్శించారు. ప్రజలకిచ్చిన ఒక్క హామీని కూడా సరిగ్గా నేరవేర్చలేదని ఆరోపించారు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో 40 ఏండ్లు కాంగ్రెస్ పాలించిందని వారి హయాంలో చేయలేని పనులను మోడీ చేసి చూపించారన్నారు.