Etela Rajender: ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ముకు ముఖ్యమంత్రులు ఓనర్లు కాదు
ప్రజల సొమ్ముకు పాలకులు ఎప్పుడూ కాపలాదారులు మాత్రమే
పదవులు ప్రజల సేవ కోసం మాత్రమే
ప్రభుత్వం ఖర్చు చేసే పైసలకు ప్రజలే ఓనర్లు
గొప్ప జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి
చిల్లర జ్ఞాపకాలు ప్రజలు పూర్తిగా మరిచిపోతారు
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కమలాపూర్, స్వేచ్ఛ: ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ముకు ముఖ్యమంత్రులు ఓనర్లు కాదని, పాలకులు ప్రజల సొమ్ముకు ఎప్పుడూ కాపలాదారులు మాత్రమేనని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ (Etela Rajender) వ్యాఖ్యానించారు. పదవులు ప్రజల సేవ కోసం మాత్రమేనని, ప్రభుత్వం ఖర్చు చేసే పైసలకు ప్రజలే ఓనర్లు అని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో గురువారం ఈటల రాజేందర్ పర్యటించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం, దేశరాజపల్లి, శంభునిపల్లి, గూడూరు, కమలాపూర్‌తో పాటు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లందకుంట మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకి చెందిన సుమారు 300 మంది ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేశారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జరిగిన ప్రతిఉద్యమానికి హుజురాబాద్ నియోజకవర్గం నాయకత్వం వహించిందని, ఇక్కడి ప్రజలు ఉద్యమాలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని ప్రశంసించారు. ఎక్కడ నిరసన కార్యక్రమం జరిగినా, సద్ది కట్టుకొని బయలుదేరి అండగా నిలిచారన్నారు. చిల్లర చరిత్ర కనుమరుగు అవుతుందని, గొప్ప జ్ఞాపకాలు ఎప్పుడూ మదిలో నిలిచిపోతాయని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కష్టకాలంలో తోడుగా ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
ప్రతి ఒక్కరు ఈటల రాజేందర్ వెంట నడవడానికి పార్టీలకు అతీతంగా ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంతో సంబంధం లేకుండా కేవలం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చానంటూ ఆయన గుర్తుచేసుకున్నారు. 25 సంవత్సరాల ముందు ఆలోచించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, అవి ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని హర్షం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే ప్రజల తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. దళిత బంధు పథకం కేవలం రాజేందర్‌ను టార్గెట్‌గా చేసుకొని పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. దళిత బంధు బకాయిల కోసం దళితుల పక్షాన ఉద్యమించి వారికి డబ్బులు వచ్చేదాకా పోరాటం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభాలకు తలొగ్గకుండా, అండగా నిలిచే, అభివృద్ధికి తోడ్పాటు అందించే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. స్థానికంగా వార్డు సభ్యుల నుంచి జెడ్పీటీసీ వరకు బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే తాను అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి
మెంతా తుఫాన్ సహా అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రతి రైతులకు నష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. వరదల కారణంగా ఆస్తులు ప్రాణ నష్టం పంట నష్టం పోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని బాధితుల పక్షాన పోరాటం చేస్తామని ఈటల అన్నారు.
