Srushti Fertility Center Case: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి సంతాన సాఫల్య కేంద్రం కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ప్రస్తుతం చెంచల్ గూడ మహిళా జైల్లో రిమాండ్ లో ఉన్న ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను సుధీర్ఘంగా విచారించారు. ఆమెతోపాటు ఇదే కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీలుగా ఉన్న కళ్యాణి, సంతోష్, నందినిని కూడా ప్రశ్నించారు. మరోవైపు నమ్రత కొడుకు జయంత్ కృష్ణను సైతం అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. డాక్టర్ నమ్రత సరోగసీ పేర చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడిన విషయం తెలిసిందే. రాజస్తాన్ కు చెందిన గోవింద్ సింగ్ దంపతులు గోపాలాపురం పోలీసులకు చేసిన ఫిర్యాదుతో నమ్రత కొన్నేళ్లుగా సాగిస్తూ వచ్చిన ఈ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు నమ్రతతోపాటు మరికొందరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు.
80వేల నుంచి లక్ష రూపాయలు ఇచ్చేదని నిర్ధారణ
వీరిలో నమ్రతకు సహకరించిన కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. సంతానం కోసం తన వద్దకు వచ్చే దంపతులతో నమ్రత మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పి సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యే భాగ్యాన్ని కలిగిస్తానని చెప్పేదని దర్యాప్తులో బయట పడింది. ఆ తర్వాత పిల్లలు వద్దనుకునేవారు, నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి డబ్బు ఆశ చూపించి రోజుల వయసున్న పిల్లలను కొని సంతానం కోసం తన వద్దకు వచ్చిన వారికి ఇచ్చేదని తేలింది. తనకు పిల్లలను ఇచ్చిన వారికి 80వేల నుంచి లక్ష రూపాయలు ఇచ్చేదని నిర్ధారణ అయ్యింది. పిల్లల కోసం తన వద్దకు వచ్చిన వారి నుంచి 20 లక్షలు మొదలుకొని 40 లక్షలు తీసుకునేదని తేలింది.
శిశువులను విక్రయించి 50కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టినట్టు
ఇలా 86మందికి పైగా శిశువులను విక్రయించి 50కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టినట్టు వెళ్లడయ్యింది. సరోగసి పేర నడిపిన ఈ చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారం మొత్తం వైజాగ్ లోని బ్రాంచ్ ద్వారా నడిపించినట్టు తేలింది. కాగా, డబ్బు వ్యవహారంలో నమ్రత మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు రావటంతో దీనిపై ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు. ఆ వెంటనే హైదరాబాద్ లో అయిదు చోట్ల, విజయవాడ, వైజాగ్ లలో రెండు ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు.
రూ.40లక్షల వరకూ డాక్టర్ నమత్రా వసూలు
పలు బ్యాంక్ అకౌంట్లతోపాటు సృష్టి రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు లేని జంటలను లక్ష్యంగా చేసుకుని నమ్రత వ్యవహారాలు నడిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరి వద్ద రూ.20 నుంచి రూ.40లక్షల వరకూ డాక్టర్ నమత్రా వసూలు చేసినట్లు నిర్ధారించుకున్నారు. కాగా, సరోగసి పేర కొల్లగొట్టిన కొట్లాది రూపాయలతో భారీగా ఆస్తులు కొనుగోలు చేయడమే కాకుండా విదేశాలకు సైతం పెద్దఎత్తున హవాలా రూపంలో నగదు పంపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుతం నమ్రత నుంచి నుంచి రాబడుతున్నారు.
