Ganja in Train: ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈగల్ టీం
6.250 కిలోల గంజాయి స్వాధీనం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పలు రైళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఈగల్ టీం (Eagle Team operation) అధికారులు, రైల్వే పోలీసులు కలిసి ఇద్దరు గంజాయి స్మగ్లర్లను (Ganja in Train) అరెస్టు చేశారు. వారి నుంచి మొత్తం 6.250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి వ్యాపారులు తరచూ గంజాయిని కొనుగోలు చేసి తెలంగాణ, మహారాష్ట్రలకు తరలిస్తున్న నేపథ్యంలో, ఈగల్ టీం అధికారులు ఈ విషయంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రైల్వే పోలీసులతో కలిసి ఒడిశా నుంచి వచ్చే రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఖమ్మంలో పట్టివేత
శనివారం ఒడిశా నుంచి వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఖమ్మం రైల్వే స్టేషన్‌లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అలోక్ ప్రధాన్ (19) అనే యువకుడిని అదుపులోకి తీసుకుని, అతని నుంచి 6 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా జమునా గ్రామానికి చెందిన బాబుజానా అనే వ్యక్తి నుంచి ఈ గంజాయి కొనుగోలు చేసి ముంబయికి తీసుకెళ్తున్నట్టుగా నిందితుడు విచారణలో వెల్లడించాడు.
కరీంనగర్‌లో మరో వ్యక్తి అరెస్ట్
కరీంనగర్ రైల్వే పోలీసులతో కలిసి జరిపిన మరో తనిఖీలో మంచిర్యాల జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన జాడి వంశీ (25) ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: దొంగతనానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న మహిళతోపాటు ఆమె సహచరున్ని టోలీచౌకీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5లక్షల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. టోలీచౌకీ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫర్హీన్ బేగం టోలీచౌకీ ప్రాంతంలోని ఎన్ఎస్ఎఫ్ కాలనీ వాస్తవ్యురాలు. గత నెల 22న మలక్‌పేటలో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లిన ఫర్హీన్ బేగం రెండు రోజుల తరువాత ఇంటికి వచ్చింది. ఆ మరుసటి రోజు బీరువా తెరిచి చూడగా దాచి పెట్టిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించ లేదు. దాంతో తన ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా టోలీచౌకీ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇన్స్‌పెక్టర్ రమేశ్ నాయక్ కేసులు నమోదు చేసి ఎస్ఐ రాఘవేంద్ర, క్రైం టీం పోలీసులతో విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఓ మహిళ, మరో వ్యక్తి టోలీచౌకీలోని మావా జువెలర్స్ వద్ద అనుమానాస్పద పరిస్థితుల్లో తచ్చాడుతున్నట్టుగా సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. విచారణలో మహిళ మలక్ పేట ప్రాంతంలో నివాసముంటున్న రుహీనా బేగం (27), వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన మహ్మద్ రజాక్ (35) అని వెల్లడైంది. వీరిని జరిపిన విచారణలో ఫర్హీన్ బేగం ఇంట్లో చోరీ చేసింది తామేనని అంగీకరించారు. ఈ క్రమంలో వారి ఇళ్లల్లో సోదాలు జరిపిన పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు.
Read Also- Minister Ponguleti: నోరుంది కదా అని తప్పుడు ప్రచారం చేయొద్దు: మంత్రి పొంగులేటి వార్నింగ్

