Drunk Driving: మద్యం తాగి వాహనాలు నడపడం అంటే తనకు తాను ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే కాక ఏ సంబంధం లేని ఎదుటి వాహనదారులను ప్రమాదంలోకి నెట్టడమే. జోగులాంబ గద్వాల జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఏటా పెరిగిపోతున్నాయి. పట్టుబడే వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే. పోలీసులు చేపట్టే విస్తృత తనిఖీల్లో తరచూ చిక్కుతుంటే కోర్టులో హాజరుపరుస్తున్నారు. స్వల్పకాల జైలు శిక్షలు విధించే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మత్తులో జరిగే ప్రమాదాలతో కుటుంబాలు రోడ్డున పడటమే కాకుండా, పెద్ద దిక్కును కోల్పోతున్నవారు కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినా, వైకల్యం బారినపడినా బీమా భరోసా కూడా దక్కదు. ఫలితంగా కుటుంబ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం నానాటికి పెరుగుతుండడంతో సమాజంలో సాంప్రదాయాలు, ఆచారాలు తగ్గిపోయి మానవ విలువలు సన్నగిల్లుతున్నాయి. ఫలితంగా యువత పెడదారి పడుతోంది.
డ్రంకెన్ డ్రైవ్ కేసులు (ఈ ఏడాది జులై వరకు) నమోదు అయినవి
2023 – 2620
2024 – 3206
2025 – 4952
ప్రమాదాల బారిన పడుతున్న మద్యం ప్రియులు
కొంత మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరిగి వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అతి వేగంగా.. అజాగ్రత్తగా ఫోన్ నడుపుతూ వాహనాలు నడపడం వల్ల ఇతర వాహనదారులూ ప్రమాదాల బారిన పడుతున్నారు. త్రిబుల్ రైడింగ్ , రాంగ్ రూట్లలో సైతం వాహనాలు నడపడం వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కొంత మందికి గాయాలు కాగా మరి కొంత మంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నియంత్రణకు పోలీస్ శాఖ డ్రంకెన్ అండ్ డ్రైవ్ చేపట్టింది. బ్రీత్ ఎనలైజర్లతో ఆల్కహాల్ పరీక్ష చేసి మద్యం తాగిన వారిపై కేసులు నమోదు చేసి జరిమాన తో పాటు శిక్ష పడేలా చేస్తుంది. అయితే.. రహదారి ప్రమాదాలను అరికట్టడానికి జిల్లాలో తరచుగా డ్రంక్ అం డ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసుల ద్వారా మందుబాబులకు దడ పుట్టిస్తున్నారు. తాగి వాహనం నడుపుతూ తనిఖీలో పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినా మందుబాబుల్లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు.
తాగి వాహనాలు నడపొద్దు.. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
మద్యం తాగి వాహనాలు నడిపించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. పట్టుబడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. తమవారు మత్తులో వాహనం నడుపుతున్నారని గమనిస్తే కుటుంబ సభ్యులు హెచ్చరించాలి. అలాగే వదిలేస్తే జరిగే అనర్థాల వల్ల బాధపడాల్సి వస్తుంది. డంక్రైన్ డ్రైవ్ పై విస్తృత తనిఖీలు ఇకపైనా కొనసాగిస్తాం.
అన్ని రకాల ఇబ్బందులే..
మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. తనిఖీల్లో పట్టుబడితే కేసులు, జైలు శిక్ష పడుతుంది.. డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోయే అవకాశం కూడా ఉంది. మత్తుకు బానిసవ్వడంతో కుటుంబంలో సైతం చిన్నచూపు చూసే అవకాశం ఉంది. భార్యాభర్తలు తరచుగా ఆర్థిక విషయాలలో గొడవలు జరగడంతో వారి ప్రభావం పిల్లలపై సైతం పడనుంది. స్వేచ్ఛగా చదవాల్సిన చిన్నారులు కుటుంబంలో నెలకొంటున్న సమస్యలు వారి లేత మనసులలో మెదలడం వల్ల వారి భవిష్యత్తుపై ప్రభావం పడనుంది. ఆర్థిక సమస్యలతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.