Miss world Contestants: 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్‌లో ‘హెడ్-టు-హెడ్ చాలెంజ్’ ఫినాలే జరిగింది. ఈ సందర్భంగా వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల కిరీటధారులు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా హైదరాబాద్‌ను అభినందనలతో ముంచెత్తారు. తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు సంబంధించి జడ్జీలు ప్రశ్నలు అడగ్గా.. అందుకు అందాల భామలు తమదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. వారి వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మహిళల భద్రతపై అభినందనలు
తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతను హక్కుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటోందని మిస్ వరల్డ్ భామలు అన్నారు. భద్రత అనేది ఒక హక్కు, దానిని అందించడంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. హైదరాబాద్ నగర వీధుల్లో మహిళలు రాత్రిపూట కూడా భయపడకుండా స్వేచ్ఛగా తిరగగలగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఇది ఒక సురక్షిత నగరానికి ప్రతీక అని అభివర్ణించారు. హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, షీ టీమ్స్, హాక్ ఐ, 24×7 పర్యవేక్షణ వంటి సాంకేతిక భద్రతా వ్యవస్థలను తాము పరిశీలించినట్లు మిస్ వరల్డ్ పోటీదారులు చెప్పారు. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు.
ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు?
తెలంగాణ సాంకేతికత, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా, మహిళల హక్కులు, విద్య, సాధికారతకు కూడా అత్యున్నత ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రంగా ఉందని పలువురు అందాల భామలు వివరించారు. ఇది ప్రపంచానికి శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మీయత, ఆదరణ, ఆతిథ్య భావం ప్రత్యేకంగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు స్ఫూర్తిదాయకంగా అనిపించాయని చెప్పారు. ‘బ్యూటీ విత్ పర్పస్’ భావన ఇక్కడ జీవనశైలిలో కనిపించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం.. అనుబంధాలు, స్నేహం, సంస్కృతికి ప్రతీకగా భావిస్తున్నామని చెప్పారు.
Also Read: Kishan Reddy: బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ.. కవిత లేఖలో పస లేదు.. కిషన్ రెడ్డి
తెలంగాణ కీర్తి విశ్వ వ్యాప్తం
ఓవరాల్ గా చుస్తే 72వ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ల కళ్లలో తెలంగాణ ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముద్ర వేసిందని అధికారులు భావిస్తున్నారు. మహిళలకు భద్రత కలిగిన, ఆత్మీయత నిండిన ప్రగతిశీల రాష్ట్రంగా నిలిచిందని అంచనా వేస్తున్నారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు తెలంగాణ కీర్తి, అతిద్య, పురోగతిని అంతర్జాతీయంగా తెలియజేస్తుందని అభిప్రాయపడుతున్నారు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తమవుతుందని విశ్వసిస్తున్నారు.